KTR: 2028లోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం- కేటీఆర్

తిట్లు.. బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతీసారి నడవవ్! జనం అన్నీ గమనిస్తున్నారు.

KTR: 2028లోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం- కేటీఆర్

Updated On : December 25, 2025 / 12:04 AM IST

KTR: తనను, కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎక్స్ లో స్పందించారు. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా? అంటూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. జల హక్కులను కాపాడటం చేతగాక.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా? అంటూ విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రాజెక్ట్ గొంతు కోసి.. సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారా? అని ధ్వజమెత్తారు.

”తెలంగాణ సోయిలేని.. రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు. అడ్డంగా దొరికిపోవడం.. ఆగమాగం కావడం.. అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా! నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక.. చిల్లర డైలాగులతో చిందులు తొక్కుతున్నావు! విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్నావు.. వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నావు! సభ్యత, సంస్కారం లేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా .. ఛీకొడుతున్నా ఇంకా మారవా?

పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నీవు.. అదే నీ స్థాయి! పనికిమాలిన శపథాలు చేయడం.. పత్తా లేకుండా పారిపోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య! శాసన సభలో..జన సభలో ప్రతి చోట కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతాం! పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తు ఊరుకోం.. పౌరుషం గల బిడ్డలం ప్రశ్నిస్తాం! ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు మేము.. రైతన్నల హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతాం!

తిట్లు.. బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతీసారి నడవవ్! జనం అన్నీ గమనిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీస్తారు! 2028లోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం! మళ్లా వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం!” అని కేటీఆర్ విరుచుకుపడ్డారు.

Also Read: నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం.. కేసీఆర్‌ని అధికారంలోకి రానివ్వను.. ఇదేనా శపథం- సీఎం రేవంత్