Aravalli Mining: ఆరావళి పర్వతాల్లో మైనింగ్.. కేంద్రం సంచలన నిర్ణయం
ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని క్లారిటీ ఇచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ.
Aravalli Mining: ఆరావళి పర్వతాల్లో మైనింగ్ కు అనుమతిస్తున్నారంటూ వార్తలు రావడం, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగడం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని క్లారిటీ ఇచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ.
కాగా, ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ‘SAVE ARAVALI’ అంటూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. ఈ క్రమంలోనే కేంద్రం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఆరావళి పర్వతం యధావిధిగా ఉంటుందని, అక్కడ మైనింగ్ జోన్ ను తీసివేస్తూ నిర్ణయం తీసుకున్నామంటూ కేంద్రం ప్రకటించింది. ఒక వేళ ఆ పర్వత ప్రాంతాల్లో మైనింగ్ కు అనుమతిస్తే.. రాజస్థాన్ ఎడారి ప్రాంతం నుంచి ఇసుక తుపాను దేశ రాజధాని వైపు ఎక్కువగా వీచే అవకాశాలు ఉన్నాయని.. ప్రకృతి విధ్వంసం జరుగుతుందని గత కొంతకాలంగా ప్రకృతి ప్రేమికులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆరావళి విశిష్టత..
మన దేశంలో అత్యంత పురాతనమైన పర్యతశ్రేణి ఆరావళి. ఇది 250 కోట్ల ఏళ్ల క్రితం నాటివని చెప్తారు. గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు ఈ పర్వతాలు విస్తరించగా.. అసలు ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి ఇసుక తుపాన్లు.. ధూళి వగైరా రాకుండా పెట్టని కోటలా ఈ పర్వతాలు కాపాడుతున్నాయని చెబుతారు. అసలు ఎడారులు ధార్ నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డు పడింది కూడా ఈ పర్వతాలే. ఈ పర్వతాలలో అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ పర్వతాల్లోనైనా అరుదైన జీవ జాతులు నిక్షేపాలు ఉంటాయ్. వాటి కోసం అన్వేషణలో భాగంగా ఈ సంపద అంతా నాశనం చేస్తున్నారు.
100 మీటర్ల కంటే ఎత్తు తక్కువ ఉన్న ఏ కొండలనైనా మైనింగ్ చేసుకోవచ్చంటూ.. మౌంటైన్.. అంటే పర్వతాలకు కొత్త నిర్వచనం ఇచ్చింది కేంద్రం. దీంతో మైనింగ్ కంపెనీలకు ఆరావళిలో దారి దొరికినట్లైంది. దీనిపైనే పీపుల్ ఫర్ ఆరావళీస్ అనే స్వచ్చంద సంస్థ ఆందోళనకి దిగింది. సేవ్ ఆరావళి అంటూ ఉద్యమించింది.
Also Read: ఇవి మామూలు విజయాలు కాదు.. ఎల్వీఎం-3 అంటే ఏంటి? ఇకపై మన దేశం..
