దుబ్బాక ఉప ఎన్నికలో కలకలం, చేగుంటలో దొంగ ఓటు

dubbaka by poll: దుబ్బాక ఉప ఎన్నిక వేళ కలకలం రేగింది. చేగుంటలో దొంగ ఓటు నమోదైంది. తమ్ముడి ఓటుని అన్న వేసి వెళ్లాడు. అసలు ఓటరు రావడంతో అధికారులు దీన్ని గుర్తించారు. తన ఓటు వేరే వారు వేశారని అసలు ఓటరు ఆందోళనకు దిగాడు. పోలింగ్ ఏజెంట్ కి తెలిసే జరిగిందని అసలు ఓటరు ఆరోపించాడు. ఓటర్ ఆందోళనతో ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పందించారు. టెండర్ ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు.
బరిలో 23మంది అభ్యర్థులు, నవంబర్ 10న కౌంటింగ్:
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 23 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9గంటల వరకు 12.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత చిట్టాపూర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
దుబ్బాక మండలం బొప్పాపూర్‌లోని పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, తొగుట మండలం తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ:
315 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిని 32 సెక్టార్లుగా విభజించారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటేయాలని ఉన్నతాధికారులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. హోరాహోరీగా సాగిన ప్రచారంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రచారం సాగించారు. సవాళ్లు, విమర్శలతో రాజకీయ వేడి పెంచారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీ కేడర్ సాయంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఎవరు గెలుస్తారు? ఎంత ఆధిక్యం వస్తుందనే అంశమై అంతటా చర్చలు నడుస్తున్నాయి.