ఆ గ్రామంలో మద్యం అమ్మితే రూ.25 వేల జరిమానా
ఈ గ్రామంలోని ప్రజలు కలిసికట్టుగా ఉంటూ 15 ఏళ్లుగా ఊరిలో మద్యం అమ్మకాలు జరగకుండా చూసుకుంటున్నారు.

మద్యం తాగితే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఎన్నో సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ తాగేస్తుంటారు. మద్యం మత్తులో విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించే తీరుతో ఇంట్లో వారు విసుగెత్తిపోతుంటారు. మద్యం మత్తులో చాలా మంది ఎన్నో దారుణాలు చేస్తుంటారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తమ గ్రామంలో మద్యం అమ్మనివ్వవద్దని తీర్మానం చేసుకున్నారు ఓ గ్రామస్థులు.
వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామంలోని ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే రూ.25,000 జరిమానా కట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఈ గ్రామంలోని ప్రజలు కలిసికట్టుగా ఉంటూ 15 ఏళ్లుగా ఊరిలో మద్యం అమ్మకాలు జరగకుండా చూసుకుంటున్నారు.
అయినప్పటికీ కొందరు డబ్బు సంపాదించాలన్న మోజులో రహస్యంగా మద్యాన్ని అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వ్యక్తి ఇటీవల ఇలాగే రహస్యంగా మద్యం అమ్మాడు. అతడి వద్ద మద్యం కొనుక్కుని తాగిన వ్యక్తి తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ప్రవర్తించాడు. తన పొలంలో సొప్ప గడ్డి కుప్పకు నిప్పు అంటించడానికి బదులుగా తన పొలం పక్కనున్న పొలంలోని సొప్పకు నిప్పంటించాడు.
దీంతో గ్రామస్థులు భగ్గుమన్నారు. నిప్పు అంటించిన వ్యక్తిని ప్రశ్నించగా, తాను మద్యం తాగిన మత్తులో నిప్పంటించినట్లు అంగీకరించాడు. రహస్యంగా మద్యం అమ్ముతుఉన్న వ్యక్తిని గ్రామ పెద్దలు మందలించి, రూ.5 వేల జరిమానా విధించారు. ఇకపై గ్రామంలో ఎవరైనా రహస్యంగా మందు అమ్మినా రూ.25,000 జరిమానా చాటింపు వేయించారు.
Tirumala Anna Prasadam Menu : తిరుమల అన్నప్రసాదం మెనూలోకి కొత్త ఐటమ్.. ఏంటో తెలుసా..