Bus Fire Accident: యూపీలో తెలంగాణకు చెందిన యాత్రికుల బస్సు దగ్ధం.. ఒకరు సజీవదహనం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 50మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు, అందులోని సామాగ్రి పూర్తిగా దగ్దం అయ్యాయి.

Bus Fire Accident
Bus Fire Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బృందావన్ క్షేత్రం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 50మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు, అందులోని సామాగ్రి పూర్తిగా దగ్దం అయ్యాయి. ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. బస్సులో మంటలు వ్యాపించిన వెంటనే ఫైరింజన్ అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బస్సు పూర్తిగా దగ్దమైంది.
Also Read: Rajnath Sing Warning : డాట్..డాట్..డాట్.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..!
తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన 50 మంది యాత్రికులు బైంసా నుంచి ఈనెల 1వ తేదీన ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తీర్ధయాత్రలకు వెళ్లారు. బస్సు మధురై నుంచి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బృందావన్ కు చేరుకుంది. బస్సులోని యాత్రికులందరూ బృందావన్ క్షేత్రాన్ని చూసేందుకు వెళ్లాడు. అయితే, ఓ వృద్ధుడు మాత్రం అనారోగ్యం కారణంగా బస్సులోనే ఉండిపోయాడు. సాయంత్రం 5.30గంటల సమయంలో పార్క్ చేసిఉన్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే మంటలు ఎక్కువకావడంతో బస్సు పూర్తిగా దగ్దమైంది. బస్సులో ఉన్న వృద్ధుడు సజీవదహనం కాగా.. యాత్రికుల సామాగ్రి పూర్తిగా దగ్దమైంది.
బస్సు ప్రమాదంలో సజీవదహనం అయిన వ్యక్తిని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సికి చెందిన ధ్రుపతిగా గుర్తించారు. అతడు తన భార్యతో కలిసి ఈ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మృతిచెందిన వ్యక్తి బస్సులో బీడీ తాగడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ఈ ప్రమాదంలో మిగిలిన యాత్రికుల సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో వారంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. వారికి బృందావన్ పోలీసులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో సంరక్షణ కల్పించారు. వారికి కావాల్సిన వసతులు ఏర్పాట్లు చేశారు.