వరద గుప్పిట్లో హైదరాబాద్, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు లీవ్

flood Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగించింది. ఆ నీటి ఉదృతికి .. రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. మంగళవారం రోజంతా భారీ వర్షం నమోదు కావడంతో.. రాత్రి వరకు వీధులన్నీ నదులను తలపించాయి. అయితే రాత్రిపూట పలు ప్రాంతాల్లో కార్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
దమ్మాయిగూడలో ఇండ్ల మధ్య వరద నీరు హోరెత్తించడంతో అక్కడ ఉన్న ఓ కారు నీటిలో కొట్టుకుపోయింది. సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ కాలనీలో కూడా రెండు వాహనాలు కొట్టుకుపోయాయి. హైదరాబాద్‌ను ఇప్పటికీ వాన వీడటం లేదు. నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తోంది. బుధవారం సాయంత్రం వరకు కాస్త రిలీఫ్ ఇచ్చినా రాత్రి నుంచి వర్షం మొదలైంది.
తెల్లవారుజామున మళ్లీ చినుకులు స్టార్ట్ అయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లంగర్‌హౌస్, గోల్కొండ, నాలానగర్, టోలిచౌకి, చార్మినార్, బహదూర్‌పురా, జూపార్కు, పురానాపూల్, మెహిదీపట్నం, హఫీజ్‌పేట్, మియాపూర్, శేరిలింగంపల్లి, షేక్‌పేట, బోరబండ, మోతీనగర్, కృష్ణానగర్‌లో వర్షం కురిసింది.
హైదరాబాద్‌పై జలఖడ్గం వేలాడుతుంది. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పాత ఇళ్లు కూలిపోయాయి. కొత్త ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. నాలాలు ఉప్పొంగాయి. మ్యాన్ హోల్స్ నోళ్లు తెరిచాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి . వాహనాలు కొట్టుకుపోయాయి.
24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారని అధికారులు చెబుతున్నారు. రోడ్లపైనే పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరం నరకకూపంగా మారిపోయింది. వరద దెబ్బకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది.
వాయుగుండం దెబ్బకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలు తెలంగాణ, ఏపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలపై ప్రభావం చూపాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగాయి. చెరువులు మత్తడి దుంకాయి. చెరువులకు గండ్లు పడి రోడ్లన్నీ కాల్వల్లా మారిపోయాయి.
వరదల్లో చిక్కుకుపోయి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిచారు. వాన బీభత్సవానికి రహదారులు సైతం కొట్టుకుపోయాయి. చాలావరకు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నిత్యావసర వస్తువులు కూడా తడిసిపోయి ఆకలితో అలమటించారు.
అతిభారీ వర్షాలతో తెలంగాణ ఆగమైంది. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సైతం రంగంలోకి దించింది. పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. గురువారం కూడా రాష్ట్రంలో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.