హైదరాబాద్‌లోని గర్ల్స్ హాస్టల్‎లో ఫుడ్ పాయిజన్.. 50మందికి అస్వస్థత

ఫుడ్ పాయిజన్ బారినపడ్డ 50 మంది విద్యార్థినుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్‌లోని గర్ల్స్ హాస్టల్‎లో ఫుడ్ పాయిజన్.. 50మందికి అస్వస్థత

Food Poison : హైదరాబాద్ లోని చందానగర్ పరిధిలో ఉన్న ఓ గర్ల్స్ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుమన్ హాస్టల్ లో ఈ ఘటన జరిగింది. విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. హాస్టల్ లో ఫుడ్ తిన్న విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. దాదాపు 50మంది ఫుడ్ పాయిజన్ కారణంగా ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి హాస్టల్ యాజమాన్యం తరలించింది. ఫుడ్ పాయిజన్ బారినపడ్డ 50 మంది విద్యార్థినుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆదివారమే ఈ ఘటన జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హాస్టల్స్ యాజమాన్యాలు వేలకు వేలకు డబ్బులు వసూలు చేస్తున్నాయి. కానీ, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మరీ దారుణంగా ఉంటున్నాయి. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు వండుతున్నారు. నాణ్యత లేని ఆహార పదార్ధాలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వంట చేసే వారు సైతం నీట్ గా ఉండటం లేదని, కలుషిత నీరు వాడుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ముఖ్యంగా వంట పాత్రలను సరిగా శుభ్రం చేయకుండానే వంటలు వండుతున్నారని, దాంతో ఫుడ్ పాయిజన్ జరుగుతోందని వాపోతున్నారు.

అలాగే నిల్వ చేసిన ఆహారాన్నే విద్యార్థులకు వడ్డిస్తున్నారు. ఇవేమీ తెలియని విద్యార్థులు ఆ ఆహారం తిని అనారోగ్యం బారిన పడుతున్నారు. కాసుల కక్కుర్తితో విద్యార్థుల ప్రాణాలతో హాస్టల్స్ యాజమానులు చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : సారు మైండ్‌గేమ్‌ను సీఎం రేవంత్‌ ప్లే చేస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి?