Kutumba Survey : తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వంసిద్ధం.. సర్వేలో సేకరించే వివరాలు ఇవే..

రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 83లక్షల కుటుంబాలు ఉండగా.. ప్రస్తుత సర్వేలో ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ బాధ్యతలు తీసుకోనున్నారు.

Kutumba Survey : తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వంసిద్ధం.. సర్వేలో సేకరించే వివరాలు ఇవే..

CM Revanth Reddy

Updated On : November 6, 2024 / 8:49 AM IST

TG Samagra Kutumba Survey 2024: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యుమరేటర్లు ఇంటింటి సర్వే చేయనున్నారు. ఇప్పటికే కుటుంబాలను గుర్తించి ఇంటికి స్టిక్కర్లు అతికించారు. ఇంటింటి సర్వేలో 56 ప్రధానమైన ప్రశ్నలు ఉన్నాయి. 19 అనుబంధ ప్రశ్నలతో మొత్తం 75 ప్రశ్నలతో కూడిన వివరాలను సేకరించనున్నారు. ఇంటింటి సర్వేకోసం సుమారు 85వేల ఎన్యుమరేటర్లు సిద్ధం కాగా.. ఇందులో దాదాపు 40వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పదిమంది ఎన్యుమరేటర్లకు ఒకరి చొప్పున 8వేల 500 మంది పర్యవేక్షకులను నియమించారు.

 

రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 83లక్షల కుటుంబాలు ఉండగా.. ప్రస్తుత సర్వేలో ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు సర్వేపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్యుమరేటర్లకు ప్రశ్నావళితోపాటు ఫ్యాడ్, పెన్ను, పెన్సిల్ అందించారు. కుటుంబ సభ్యుల పేర్లతోపాటు అందరి మొబైల్ నెంబర్లు సేకరిస్తారు. సమగ్ర కుటుంబ సర్వేలో కులం, మతం, సామాజిక అంశాలపై వివరాలు సేకరించనున్నారు. కుటుంబ సభ్యుల వారీగా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షిక ఆదాయ వివరాలు సేకరించనున్నారు. కుటుంబానికి ఉన్న భూములు, ఇళ్లు, ఇతర స్థిర, చరాస్తుల వివరాలు సేకరిస్తారు.

 

ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్ ప్రయోజనాల వివరాలు.. గత ఐదేళ్లుగా పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది, తీసుకున్న రుణాలు, గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతినిధులుగా, నామినేటెట్ పదవులపై వివరాలు సేకరించనున్నారు. అదేవిధంగా.. కుటుంబ సభ్యులు విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారా అనే అంశాలపైనా సర్వేలో ఎన్యుమరేటర్లు వివరాలు సేకరించనున్నారు. సొంత ఇళ్లు – అద్దె ఇళ్లు వివరాలు, ఇంట్లో ఫ్రిజ్, కారు, ద్విచక్రవాహనం, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వివరాలు సేకరించనున్నారు. ప్రజల నుంచి సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు ఇంటింటి సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.