45నిమిషాలు సాగిన విచారణ.. కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నలకు హరీశ్ రావు చెప్పిన సమాధానాలు ఇవే..
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం హాజరయ్యారు.

Kaleswaram Commission: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో కొనసాగిన విచారణలో కమిషన్ హరీశ్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించింది. సుమారు 45 నిమిషాల పాటు ఈ విచారణ సాగింది.
కమిషన్ ఎదుట మొదట ప్రమాణం చేసిన తర్వాత.. తాను తెలుగు మీడియం స్టూడెంట్ ను కాబట్టి పూర్తిస్థాయిలో ఇంగ్లీషును మాట్లాడలేనని.. అర్థం చేసుకోగలనని కమిషన్ కు హరీష్ రావు చెప్పారు.దీంతో ఈ అంశాన్ని జడ్జి పరిగణలో తీసుకొని ఇంగ్లీష్ ఇబ్బంది అయితే హిందీలో చెప్పవచ్చు.. లేదా తెలుగులో చెప్పిన తనకు ట్రాన్స్ లేట్ చేసేవారు ఉన్నారని తెలిపారు. అయితే, కమిషన్ విచారణలో భాగంగా కొన్ని సందర్భాల్లో జడ్జి అడిగిన ప్రశ్నలను హరీశ్ రావు అర్థం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా టెక్నికల్ అంశాలకు సంబంధించి ప్రశ్నించినప్పుడు అది అధికారులు చూసుకున్నారని మాత్రమే హరీశ్ రావు సమాధానం ఇచ్చారు.
ప్రాజెక్టు స్థల మార్పు.. తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా..
కేంద్ర సర్వే సంస్థ వ్యాప్కోస్, టెక్నికల్ కమిటీ, హై పవర్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు మార్చాల్సి వచ్చిందని హరీశ్ రావు వివరించారు. ప్రధానంగా మహారాష్ట్ర అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి గుడిగడ్డకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. 152 అడుగుల నుంచి 148 అడుగులకు మార్చితే.. నీటి లభ్యత ఉండదని.. సెంట్రల్ వాటర్ కమిషన్ సైతం స్పష్టం చేసిందని తెలిపిన హరీశ్ రావు.
కాళేశ్వరం కార్పొరేషన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించిన కమిషన్..
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిధుల విషయానికి సంబంధించి ఇబ్బందులు ఉండడంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కార్పొరేషన్‌కు పూర్తిగా గ్యారెంటీ రాష్ట్ర ప్రభుత్వం ఉందని హరీశ్ రావు వివరించారు.
ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును ఎలా తీరుస్తారని అనుకున్నారు..?
ప్రాజెక్టు వల్ల కేవలం ఇరిగేషన్ మాత్రమే కాకుండా.. పరిశ్రమలకు నీళ్లు ఇవ్వడం, ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా తీర్చాలని లక్ష్యంతో చేశాం. కోకోకోలా కంపెనీ నీటి అవసరాలు కూడా కాలేశ్వరం ద్వారానే తీర్చాలని భావించాం. కోవిడ్ వల్ల కొన్ని కంపెనీలు ప్రాజెక్టు పరిధిలో రాలేకపోయాయని హరీశ్ రావు చెప్పారు.
ప్రాజెక్టుకు సంబంధించిన లొకేషన్ మార్చడానికి గల అంశాలను వివరిస్తూ.. గతంలో కూడా అనేక ప్రాజెక్టుల లోకేషన్లు మార్చిన అంశాలను హరీష్ రావు ప్రస్తావించారు.. నాగార్జునసాగర్ ఏలేశ్వరం నుంచి నందికొండకు మార్చిన అంశం.. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సమ్మక్క బ్యారేజ్ వంటి అంశాలను కమిషన్ ముందు ప్రస్తావించారు. ప్రాజెక్టు స్థల మార్పు తుమ్మడి హెట్టి నుంచి మేడిగడ్డకు మార్పుది కూడా హై పవర్ కమిటీ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన హరీశ్.. అన్ని అంశాలకు సంబంధించి అఫిడవిట్ రూపంలో కమిషన్ కు అందజేశారు.
బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలని ఎవరు సూచించారని కమిషన్ ప్రశ్నించగా.. అది టెక్నీకల్ విషయం, ఇంజనీర్లు తీసుకున్న నిర్ణయం అంటూ హరీశ్ రావు సమాధానం ఇచ్చారు.
కాళేశ్వరం బ్యారేజీల్లో ఎంత నీటిని నిల్వ చేయొచ్చు అంటూ కమీషన్ ప్రశ్నించగా.. 140 టీఎంసీలు నిల్వ చేయొచ్చ అని హరీష్ రావు చెప్పారు. సిడబ్ల్యుసి, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగిందన్న హరీశ్ రావు.. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టే తుమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డ కు మార్చామని స్పష్టం చేశారు. 16లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే.. రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని CWC చెప్పింది. సీబ్ల్యుసీ సూచనల మేరకే బ్యారేజీలు, రిజర్వాయర్ల సంఖ్య పెంచామని, మేడిగడ్డ నిర్మాణం ఒక్కరి నిర్ణయం కాదు.. మేడిగడ్డ నిర్మాణానికి ముందు మంత్రులు అధికారులు అనేకసార్లు భేటీ అయ్యారని హరీశ్ రావు కాళేశ్వరం విచారణ కమిషన్ కు తెలిపారు.