కేసీఆర్‌తో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ.. కవిత వ్యాఖ్యలపైనే ప్రధానంగా చర్చ..?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు..

కేసీఆర్‌తో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ.. కవిత వ్యాఖ్యలపైనే ప్రధానంగా చర్చ..?

Jagadish Reddy KCR

Updated On : August 4, 2025 / 12:18 PM IST

KCR – Jagadish Reddy: బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఆదివారం సాయంత్రం పలువురు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. ఇవాళ ఉదయం కేసీఆర్‌తో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల నేఫథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో కేటీఆర్ కూడా పాల్గొన్నారని సమాచారం.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమైన ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నా గురించి మాట్లాడుతున్నారు. ఆయనను ప్రోత్సహిస్తున్నదెవరు..? ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సర్వనాశనం కావడానికి, 11 నియోజకవర్గాల్లో ఓటమికి కారణం ఆయనే అంటూ పరోక్షంగా జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ కవిత కామెంట్స్ చేశారు. కవిత వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డిసైతం ఘాటుగా స్పందించారు.

నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, బీఆర్ఎస్ ను అంతం చేయాలని చూస్తున్నవాళ్లు నా గురించి ఏం మాట్లాడుతున్నారో.. ఇవాళ కవిత కూడా అదే మాట్లాడుతున్నారు. నల్గొండ జిల్లాలో గత పాతికేళ్లలో జరిగిన ఉద్యమాలకు, సాధించిన విజయాలకు నేను బాధ్యుడిని అయితే.. ఇప్పుడు ఓటుమికి కూడా నేనే బాధ్యుడిని. ఎవరేం మాట్లాడినా.. అంతిమంగా పార్టీ నిర్ణయమే శిరోధార్యం. కొంత మంది ఎదో ఊహించుకుంటున్నారు. అది వారి భ్రమ అంటూ కవిత వ్యాఖ్యలకు జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇలా కవిత, జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ కేసీఆర్ తో జగదీశ్ రెడ్డి భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.