తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ అరెస్ట్..
గతంలో ఇదే కేసులో విచారించి నోటీసులు ఇచ్చి దిలీప్ ను వదిలేసిన సీసీఎస్ పోలీసులు.. ఇవాళ అరెస్ట్ చేశారు.

Former Telangana Digital Media Director Arrested (Photo Credit : Google)
Former Telangana Digital Media Director Arrested : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దిలీప్ ను విచారించిన పోలీసులు.. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల తర్వాత ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
కొమురం భీం జిల్లా జైనూరు మండలంలో మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నం ఘటనలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్ చేసినట్లు దిలీప్ పై ఆరోపణలు ఉన్నాయి. దీన్ని సుమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఇదే కేసులో విచారించి నోటీసులు ఇచ్చి దిలీప్ ను వదిలేసిన సీసీఎస్ పోలీసులు.. ఇవాళ అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
కొణతం దిలీప్.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా. జైనూర్ ఘర్షణలకు సంబంధించిన వీడియో లింకులను దిలీప్ సెప్టెంబర్ లో సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు దిలీప్ పై కేసు నమోదు చేశారు. దిలీప్ ను విచారణకు పిలిపించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. స్టేషన్ కు తీసుకెళ్లి తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
అరెస్ట్ ముందుకు దిలీప్ సోషల్ మీడియోలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. సింహం విగ్రహం పక్కన నిల్చుని దిలీప్ ఒక ఫోటో తీయించుకున్నారు. ఆ పిక్ ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తలపై కవచం కట్టుకునే వారు మరణానికి భయపడరు అంటూ ఓ కొటేషన్ కూడా రాశారు.
కొణతం దిలీప్ అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దిలీప్ అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్.. రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించినందుకే దిలీప్ ను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిజాం రాజ్యాంగం, డిక్టేటర్ పాలన అమలు చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. అటు మాజీ మంత్రి హరీశ్ రావు సైతం దిలీప్ అరెస్ట్ ను ఖండించారు. వెంటనే దిలీప్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వంపై మండిపడ్డారు.
జైనూరు ఘర్షణలకు సంబంధించిన వీడియో లింక్ ను రీపోస్ట్ చేసిన కేసులో.. సెప్టెంబర్ 6న దిలీప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి విడిచిపెట్టారు. జైనూరు ఘర్షణలకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోలు, ఫోటోలను పోలీసులు సుమోటోగా తీసుకుని దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 12 గంటల పాటు విచారించి విడిచిపెట్టారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని ఆయన చెప్పి పంపేసిన పోలీసులు.. తాజాగా అరెస్ట్ చేశారు.
Also Read : గ్రామస్తులను రెచ్చగొట్టింది ఇతడే..! లగచర్ల ఘటనలో సూత్రధారి రాఘవేందర్ సస్పెండ్..