అమానవీయం : తండ్రి పాడెను మోసిన కూతుళ్లు, తలకొరివి పెట్టిన భార్య

girls cremate their father : అసలే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉంది. అనారోగ్యంతో కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్యా పిల్లలు గుండెలు పగిలేలా రోదించారు. ఇలాంటి సమయంలో వారిని ఓదార్చేవారే కరువయ్యారు. అండగా ఉండాల్సిన గ్రామస్తులు మొహం చాటేశారు. దీంతో గుండెల్లోని బాధను, ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకోవడం వారికి సాధ్యం కాలేదు. పుట్టెడు శోకంలోనే.. ఆడపిల్లలే తన తండ్రి పాడెను మోశారు. భార్యే తన భర్తకు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. అందరూ ఉన్నా… అనాథలా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఈ ఘటన ములుగు జిల్లాలోని మారుమూల మండలం వాజేడులోని కొంగాల గ్రామంలో జరిగింది.
వాజేడు మండలం కొంగాలకు చెందిన లింగయ్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం చనిపోయాడు. దీంతో లింగయ్య భార్య, ముగ్గురు కూతుళ్లు గుండెలవిసేలా రోదించారు. స్నేహితులకు, బంధువులకు సమాచారం చేరవేశారు. అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కోరగా…. గ్రామస్తులెవరూ ముందుకు రాలేదు.
తాము ఆడపిల్లలమని…తన తండ్రి మృతదేహాన్ని చితి వరకు తీసుకెళ్లాలని కోరారు. ఎవరూ ముందుకురాకపోవడంతో.. వారు మరింత కుమలిపోయారు. గ్రామస్తులు సహకరించకపోయినా…. లింగయ్య కూతుళ్లే పాడె మోసేందుకు సిద్ధమయ్యారు. పరామర్శించడానికి వచ్చిన బంధువుల సాయంతో ముగ్గురు కూతుళ్లు లింగయ్య మృతదేహాన్ని శ్మశానానికి చేర్చారు. అనంతరం లింగయ్య భార్యే.. తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసింది. ఈ దృశ్యాలు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేశాయి.