Golconda Fort : గోల్కొండ కోట సమీపంలో ‘రహస్య సొరంగం’ కలకలం.. పురావస్తు శాఖ అసలు నిజం ఏంటో చెప్పేసింది..
Golconda Fort Secret Tunnel : హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో రహస్య సొరంగం బయటపడింది.
golconda fort secret tunnel
Golconda Fort Secret Tunnel : హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో రహస్య సొరంగం బయటపడింది. ఈ వార్తలపై పురావస్తు శాఖ స్పష్టత ఇచ్చింది. అక్కడ బయటపడింది సొరంగం కాదని.. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన చిన్న దీర్ఘచతురస్రాకార గది అని తేల్చింది.
గోల్కొండ కోట పరిధిలోని పటాన్చెరు దర్వాజా సమీపంలో, కుతుబ్ షామీ శ్మశాన వాటిక దగ్గర ఉన్న అఠారా సీడీ వద్ద ఆర్మీ తవ్వకాల్లో భూగర్భంలో ఓ నిర్మాణం బయటపడింది. అగ్నివీర్ లకు శిక్షణ ఇచ్చేందుకు గోల్కొండ ఆర్టిలరీ అధికారులు పొక్లెయిన్ సహాయంతో భూమిని చదును చేస్తుండగా.. ఈ సొరంగం బయటపడింది. ఇది సొరంగం అని.. ఇక్కడి నుంచి చార్మినార్ కు డైరెక్ట్ దారి ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పురావస్తు శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. చివరకు అది గోల్కొండ పాలకుల కాలంలో ఉపయోగించిన ఒక సీక్రెట్ గది అని తేల్చారు.
బయటపడిన గది 1.2 మీటర్ల వెడల్పు, 1.8 మీటర్ల పొడవు, 2.2 మీటర్ల లోతుతో రెక్టాంగెల్ షేప్ లో ఉందని, గ్రానైట్ రాళ్లతో నిర్మించారని, ఇంటీరియల్ గోడల మాదిరిగా చుట్టూ సాధారణ రాళ్లను పేర్చారని పురావస్తుశాఖ అధికారులు పేర్కొన్నారు. గతంలో మధ్య యుగానికి చెందిన కొన్ని ఎరుపు రంగు మట్టి పాత్రల శకలాలు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో దొరికాయని, తమ పరిశోధన పూర్తయ్యేంత వరకు భూమిని చదును చేసే పనులను ఆపాలని ఆర్మీ అధికారులను పురావస్తు శాఖ విజ్క్షప్తి చేసింది.
