టీఎస్‌ఆర్టీసీకి మంచి రోజులు రాబోతున్నాయా? లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందా?

good days for tsrtc: కరోనాతో పుట్టెడు నష్టాల్లోకి వెళ్లిన టీఎస్‌ఆర్టీసీకి మంచి రోజులు రాబోతున్నాయా? ప్రగతి చక్రాలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందా? ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారా? కార్గో సేవలు ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్నాయా? టిక్కెటేతర ఆదాయం అధికారులు దృష్టి పెట్టారా..?
జీతాల కోసం కూడా కష్టాలే:
టీఎస్ ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తోంది. కరోనా మహమ్మారి ఆర్టీసీని మరింతగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కుతుందనుకుంటున్న సమయంలో… కరోనాతో కుదేలైంది. చివరికి సిబ్బంది జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితిలో ఆర్టీసీ లేదు. ఉద్యోగుల వేతనాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.
కార్గో కొరియర్ సర్వీసుతో సత్ఫలితాలు:
ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడంపై కేసీఆర్ దృష్టి సారించారు. ఆర్టీసీలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. కార్గో సర్వీసులను ప్రవేశపెట్టారు. ఇక అన్‌లాక్‌లో భాగంగా…. ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను తిప్పుతున్నా… ప్రజలు మాత్రం ఎక్కేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లా సర్వీసులకు కొంత ఆదరణ లభిస్తున్నా…. హైదరాబాద్ సిటీలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం భాగ్యనగరంలో ఆర్టీసీ 25శాతం బస్సులనే నడుపుతోంది.
హైదరాబాద్‌లో 50శాతం బస్సులు పునరుద్ధరణకు ఆదేశం:
సీఎం కేసీఆర్ ఆదివారం(నవంబర్ 15,2020) ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ వన్ మిలియన్ దాటిన నేపథ్యంలో… ఆర్టీసీ అధికారులను కేసీఆర్ అభినందించారు. ఆర్టీసీ పరిస్థితి, ఉద్యోగుల భద్రతపై చర్చించారు. కరోనా కాలంలో ఉద్యోగులకు కోత విధించిన జీతాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. అంతేకాదు.. హైదరాబాద్‌లో 50శాతం బస్సులను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించే విధి విధానాలు రూపకల్పన చేయాలని నిర్ణయించారు.
ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి:
ఆర్టీసీ ఆదాయాల మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కార్గో కొరియర్ సర్వీసుల ద్వారా లాభాల బాటలో పయనించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు.. టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకునే దిశగా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. పెట్రోల్ బంకులు, ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్ లాంటి వాటిపై దృష్టి సారించారు. వీటికి తోడు ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహకాలతో ఆర్టీసీ గాడినపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో లాభాల బాటలో పయనించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది.
ఆర్టీసీ సంస్థను బతికించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరోనా కాలంనాటి పెండింగ్ జీతాలు చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటూ కేసీఆర్ చెప్పడంతో.. ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి మంచి రోజులు రాబోతున్నాయంటూ ఆనందపడుతున్నారు.
https://www.youtube.com/watch?v=3Uk1vq7bX9o