Payal Shanker: సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం.. షాక్‌లో కాంగ్రెస్ క్యాడర్..! పొగడ్తలకు కారణం అదేనా?
పాయల్ శంకర్ స్పీచ్ విని అక్కడున్న జనాలే కాదు..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా షాక్ అయ్యారట. కాసేపు అంతా అయోమయంలోకి వెల్లిపోయారన్న చర్చ జరుగుతోంది.
Payal Shanker: ఆ రెండు జాతీయ పార్టీలు. వాటి సిద్ధాంతం పరస్పర విరుద్ధం. పైగా తెలంగాణలో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటోంది బీజేపీ. అధికారంలోకి రాబోయేది కూడా తామేనని చెప్తోంది. కానీ ఆ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం..కాంగ్రెస్ పార్టీ సీఎంను ఆకాశానికి ఎత్తారు. ఏకంగా ప్రశంసలు, పొగడ్తలతో..సొంత పార్టీ ఎమ్మెల్యే కంటే ముఖ్యమంత్రికి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. ఇంతకు ఆ కమలం పార్టీ ఎమ్మెల్యే ఎందుకలా మాట్లాడారు? బీజేపీ పెద్దల రియాక్షన్ ఏంటి?
కాంగ్రెస్ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే. ఆ రెండు పార్టీలు లైన్ వేరు. వాటి భావజాలం అంతకంటే వేరు. కానీ అధికార పార్టీ సీఎంపై..బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించిన సీన్..ఆదిలాబాద్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో హైలెట్‌గా నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ దిగినప్పటి నుంచి..ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ వెళ్లే వరకు అన్నీ తానై చూసుకున్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్. కాంగ్రెస్ సొంత పార్టీ నేతల కంటే ఘనంగా సీఎంకు స్వాగతం పలకడమే కాదు, స్పెషల్‌గా బహుమతి ఇవ్వడం, సీఎం కారులోనే తిరగడం.. సభ ముగిసే వరకు సీఎంను అతుక్కొని ఉన్నారు పాయల్ శంకర్.
అసలు పాయల్ శంకర్ బీజేపీనా? లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేనా?
అయితే ప్రోటోకాల్‌లో భాగంగా సీఎం ప్రోగ్రామ్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాల్గొన్నారుకున్నారు అంతా. కానీ ఎప్పుడైతే సభాధ్యక్ష ఉపన్యాసం స్టార్ట్ చేశారో..అప్పుడు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు పాయల్ శంకర్. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లీడర్లు, మంత్రులకంటే కూడా గొప్పగా పొగడ్తలతో ముంచెత్తారు. పాయల్ శంకర్ ఉపన్యాసం ప్రారంభం కాగానే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కల్పించుకొని హస్తం క్యాడర్‌ను కంట్రోల్ చేశారు. తర్వాత పాయల్ శంకర్ స్పీచ్ విని అక్కడున్న జనాలే కాదు..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా షాక్ అయ్యారట. కాసేపు అంతా అయోమయంలోకి వెల్లిపోయారన్న చర్చ జరుగుతోంది. సీఎంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై పాయల్ శంకర్ పొగడ్తలు, ప్రశంసలు కురిపించడాన్ని చూసి అసలు పాయల్ శంకర్ బీజేపీనా? లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేనా అని ముక్కున వేలేసుకున్నారట. రేవంత్‌ను ఆకాశానికి ఎత్తేసిన తీరు చూసి అంతా విస్తుపోయారట.
సీఎంను మోసేయడంపై సొంత పార్టీలోనూ అసంతృప్తి..!
సీఎం రేవంత్ కూడా పాయల్ శంకర్, బీజేపీపై సాఫ్ట్ కార్నర్ స్పీచ్ ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. సీఎం స్పీచ్‌తో పాటు పాయల్ శంకర్ స్పీచ్ కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశాయి. ఆదిలాబాద్‌లో సీఎం సభ జరిగిన రోజు బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. హిందూ దేవుళ్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ దిష్టిబొమ్మల దగ్ధం చేసింది. ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం నిరసనలు కనబడకపోగా ఎమ్మెల్యే సీఎంను మోసేయడంపై సొంత పార్టీలోనూ కొందరు అసంతృప్తికి గురయ్యారట.
సీఎం ఆదిలాబాద్ జిల్లాకి చేరుకోవడానికి ముందే బీజేపీ క్యాడర్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సీఎం దత్తత తీసుకున్న ఆదిలాబాద్ జిల్లాకు ఇచ్చిన హమీలు ఏమయ్యాయని, అభివృద్ది ఎక్కడ అంటూ ప్రశ్నిస్తూ వాట్సప్ స్టేటస్‌లు, ఫేస్ బుక్, ఇన్‌స్టా పోస్టులు హోరెత్తించారు. పాయల్ శంకర్ స్పీచ్ తర్వాత బీజేపీ సోషల్ మీడియా పోస్టులన్నీ మాయమయ్యాయి. అంటే కాషాయం క్యాడర్ ఎంతలా హర్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగానే ప్రశంసలు కురిపించడం ఉమ్మడి జిల్లాలోని మిగితా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారిందట. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఒకవైపు హిల్ట్ పాలసీపై పోరాడుతూ ఉంటే..బీజేఎల్పీ ఉపనేతగా ఉన్న పాయల్ శంకర్ సీఎంను సొంత పార్టీ నేతల కంటే ఎక్కువగా పొగడటం ఉమ్మడి జిల్లాలో పార్టీకి తలనొప్పిగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. పాయల్ శంకర్ స్పీచ్..పంచాయతీ ఎన్నికలతో పాటు త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికలపై ఎఫెక్ట్ చూపిస్తుందని బీజేపీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు.
కాంగ్రెస్‌లో కూడా ఇదే రకమైన చర్చ జరుగుతోందట. సీఎం రేవంత్ ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్‌ను అమాంతం ఎత్తేయడంతో ఏం చేయాలో తోచని పరిస్థితికి కాంగ్రెస్ క్యాడర్ వెళ్లిపోయింది. ఇప్పటికే ఇక్కడ ఐదారు గ్రూపులతో హస్తం పార్టీ అష్టకష్టాలు పడుతుంటే ..కొత్తగా పాయల్ శంకర్ ఎపిసోడ్ ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదట. సొంత పార్టీని ప్రమోట్ చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి..బీజేపీ ఎమ్మెల్యేను, కేంద్ర మంత్రులను మెచ్చుకోవడం ఏంటంటూ కాంగ్రెస్ లీడర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట.
బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం?
ఇదే అదునుగా పాయల్ శంకర్ వ్యాఖ్యలను హైలెట్ చేస్తోంది బీఆర్ఎస్. బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం మరోసారి బయటపడిందని..ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు గులాబీ లీడర్లు. భవిష్యత్‌లో పాయల్ శంకర్ కాంగ్రెస్‌లోకి వెళ్లొచ్చని, లేదా సీఎం రేవంత్ బీజేపీలోకి చేరిపోవచ్చని జోస్యం చెప్తున్నారు మాజీమంత్రి జోగురామన్న.
సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు టీడీపీ నుంచే కాస్త దోస్తానా ఉంది. ఆనాటి స్నేహపూర్వక వాతావరణాన్ని నేటికీ కొనసాగించడం మంచిదే. కానీ పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలున్న పార్టీలో ఉండి.. కాంగ్రెస్ సీఎంను పాయల్ శంకర్ ఆకాశానికి ఎత్తడమే చర్చకు దారితీస్తోంది. జిల్లాలో మహేశ్వర్ రెడ్డితో సహా మిగితా బీజేపీ ఎమ్మెల్యేలది కాస్త భిన్నమైన తీరు. పార్టీ లైన్‌లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లకుండా ఉంటున్నారు. ఒకవేళ వెళ్లినా పాల్గొన్నామా అంటే పాల్గొన్నాం అన్నట్లుగా నడుచుకుంటున్నారు మిగితా ఎమ్మెల్యేలు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అయితే పూర్తిగా పార్టీ లైన్‌లోనే ఉంటున్నారు. పాయల్ శంకర్ మాట్లాడిన తీరుపై బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: పదేళ్లు నేనే సీఎం..! రేవంత్ రెడ్డి ధీమా వెనక అసలు కారణమేంటి?
