Cm Revanth Reddy: పొత్తు ఉండబోదని ఒట్టేసి చెప్పాలి.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ వెనుక పెద్ద ప్లానే..!
బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించడానికే సిల్లీ కామెంట్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
- కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ..
- కారు, కమలం పొత్తు ఖాయమంటున్న సీఎం రేవంత్
- నెక్స్ట్ ఎలక్షన్ సెంట్రిక్‌గా ఇప్పటినుంచే పొలిటికల్ గేమ్
Cm Revanth Reddy: ఆ ఇద్దరు పొత్తు పెట్టుకోబోతోన్నారు. ఛాలెంజ్ చేసి చెబుతున్నా. తన మాట తప్పైతే..కేసీఆర్ ఒట్టేసి చెప్పాలంటున్నారు సీఎం రేవంత్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని సీఎం రేవంత్ అంటుండగా..సింహం సింగిల్‌గానే పోటీ చేస్తుందని బీఆర్ఎస్ చెబుతూ వస్తోంది. బీజేపీతో పొత్తు ఉండబోదని ఒట్టేసి చెప్పాలని రేవంత్ సవాల్ విసరడం వెనుక ప్లానేంటి? పక్కా ప్లాన్‌తోనే రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారా?
తెలంగాణలో ఓట్ల రాజకీయం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగా..అప్పుడే పొత్తులపై అగ్గి రాజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. బీఆర్ఎస్, బీజెపీ ఒకటేనంటూ ఎప్పటినుంచో ఆరోపిస్తూ వస్తున్న రేవంత్..ఇప్పుడు మరింత డోస్ పెంచారు. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్, బీజేపీ రహస్య బంధానికి ఎగ్జాంపుల్ అని రేవంత్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉండగా ఇప్పటి నుంచే ఆ రెండు పార్టీలను ఫిక్స్ చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జనసమితి, లెఫ్ట్ పార్టీలు ఒక టీమ్.. బీజేపీ, బీఆర్ఎస్ మరో టీం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌లో కామెంట్ చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసరడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో బీజెపీతో కలిసి పని చేయబోమని కేసీఆర్ తన ఇష్టదైవం మీద ఒట్టేసి చెప్పాలన్నారు రేవంత్.
బీజేపీ, బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే ప్లాన్..!
అయితే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా చర్చను తెరపైకి తెచ్చినట్లు చర్చ జరుగుతోంది. బీజేపీ వ్యతిరేక శిబిరాన్ని తనవైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ స్పందించకపోతే బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ నిజమేనన్న వాయిస్‌ను ఇంకా బలంగా వినిపించాలనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. కారు, కమలం బంధం నిజం కాకపోతే కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేయాలనే డిమాండ్ చేస్తున్న రేవంత్..ఇంకోవైపు వాళ్లిద్దరి పొత్తు ఖాయమంటూ మైండ్ గేమ్ స్టార్ చేశారన్న టాక్ నడుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే ప్లాన్‌లో భాగంగానే..పొత్తు పే చర్చ..ఒట్టేసి చెప్పు అంటూ చర్చకు దారితీశారన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి.
బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించడానికే సిల్లీ కామెంట్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమ ఫెయిల్యూర్స్‌ను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి ప్రతిరోజూ కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, తెలంగాణ ప్రయోజనాల కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి అసహనంతో ఇలాంటి సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డ కేటీఆర్..వంద రోజుల్లో నెరవేరుస్తామన్న ఆరు గ్యారెంటీలు సంగతేంటో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవప్రదంగా మాట్లాడాలని, సవాళ్లు విసరడం రేవంత్ రెడ్డి అపరిపక్వతకు నిదర్శనమని కేటీఆర్ కామెంట్ చేశారు.
కేసీఆర్ రియాక్ట్ అవ్వరనే రేవంత్ సవాల్..!
బీజేపీతో పొత్తుపై గులాబీ బాస్‌ను ఇరుకునపెట్టేందుకు..రేవంత్ విసిరిన సవాల్‌కు కేటీఆర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ రియాక్ట్ కారని తెలిసే రేవంత్ రెడ్డి సవాల్ విసిరారనే చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కాకుండా మిగతా నేతలు ఎవరు స్పందించినా..అంతగా జనంలోకి వెళ్లదని, అలా అని కేసీఆర్ స్పందించరనేదే రేవంత్ అంచనాగా చెబుతున్నారు. కారు, కమలం పొత్తు అంటూ రేవంత్ ఆడుతున్న మైండ్ గేమ్‌ను గులాబీ పార్టీ ఎలా ఎదుర్కొంటుందన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
