Gossip Garage : రాజీకి వచ్చేశారా? సీఎం రేవంత్, సినీ పెద్దల భేటీలో జరిగిందేమిటి?

సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం.. ఆ తర్వాత పరిణామాలతో.. సర్కార్ వర్సెస్‌ సినిమా అన్నట్లు యుద్ధం కనిపించింది.

Gossip Garage : రాజీకి వచ్చేశారా? సీఎం రేవంత్, సినీ పెద్దల భేటీలో జరిగిందేమిటి?

Updated On : December 27, 2024 / 9:07 PM IST

Gossip Garage : సినిమా వాళ్లు, సర్కారోళ్ల మీటింగ్ అంటే.. ఓ వర్గానికి మాత్రమే ఇంట్రస్ట్. ఐతే ఇది అలాంటి ఇలాంటి మీటింగ్ కాదు. రాష్ట్రమంతా ఎదురుచూసింది. ఏం జరుగుతుందా అని ఆసక్తిగా గమనించింది. తెలంగాణ సీఎం రేవంత్‌తో.. ఇండస్ట్రీ పెద్దలు తొలిసారి భేటీ అయ్యారు. ఓవైపు సంధ్య థియేటర్ వివాదం.. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ రచ్చ.. ఇలాంటి పరిణామాల మధ్య సీఎంతో ఇండస్ట్రీ పెద్దలు ఏం చర్చించారు.. ఏఏ అంశాలు చర్చకు వచ్చాయ్‌. ఇండస్ట్రీకి, సర్కార్‌కు మధ్య రాజీ కుదిరిందా.. సీఎం రేవంత్ కోపం తగ్గిందా.. మీటింగ్ ఇన్‌సైడ్ టాక్ ఏంటి..

సీఎం రేవంత్‌ ప్రకటనతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్..
సంధ్య థియేటర్ ఘటన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య గ్యాప్ ఏర్పడినట్లు క్లియర్‌గా అర్థమైంది. ఇక బన్నీ అరెస్ట్ ఎపిసోడ్‌తో.. మరింత అగాధంగా మారిందా అనే చర్చ జరిగింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌.. సినిమా రంగ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిఫిట్‌ షోలు, టికెట్ ధరల పెంపు ఇకపై ఉండవంటూ.. అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సంక్రాంతి సీజన్ వేళ.. సీఎం రేవంత్‌ ప్రకటనతో.. టాలీవుడ్ ఉలిక్కిపడింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్‌..
సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ పెద్దలంతా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మీటింగ్‌ అనే మాట బయటకు వచ్చినప్పటి నుంచి.. ఆ సమావేశం ముగిసేవరకు.. సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. పొలిటికల్‌ వర్గాల్లో ఆసక్తి కనిపించింది. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎంతో ఇండస్ట్రీ పెద్దలు జరిపిన ఫస్ట్ మీటింగ్ ఇదే కావడం హైలైట్.

Cm Revanth Tollywood Stars Meet

Cm Revanth Tollywood Stars Meet (Photo Credit : Google)

రియల్ లైఫ్‌లోనూ హీరోలుగా ఉండాలని సూచన..
సంధ్య థియేటర్‌ ఘటనను మరోసారి ప్రస్తావించిన సీఎం రేవంత్‌.. కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఘటనకు సంధ్య థియేటర్ యాజమాన్యం, పుష్ప మూవీ నిర్మాతలతో పాటు హీరోనే కారణం అంటూ.. ఇండస్ట్రీ పెద్దలకు చిన్నపాటి క్లాస్‌ కూడా తీసుకున్నారని టాక్‌. సినిమా హీరోలంతా సమాజానికి ఆదర్శంగా ఉండాలని.. రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోలుగా ఉండాలని హితోపదేశం చేసినట్లు తెలుస్తోంది.

Also Read : వైసీపీని వీడి బీజేపీలో చేరిన ఆడారి ఆనంద్.. కూటమి పార్టీల్లో చిచ్చు రాజేసిందా?

సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. అది దృష్టిలో పెట్టుకుని సినిమాలు రూపొందించడంతో పాటు వ్యక్తిగతంగాను సినీ రంగానికి చెందిన వాళ్లు అందరికి ఆదర్శంగా ఉండేలా నడుచుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. మహిళల భద్రత, డ్రగ్స్ కట్టడి ప్రచారంలో సినీ ప్రముఖులు పాల్గొనాలని సీఎం రేవంత్ సూచించినట్లు ఇన్‌సైడ్‌ టాక్‌.

శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..
ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని.. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌ క్లియర్‌కట్‌గా చెప్పారు. ఐటీ, ఫార్మాతో పాటు.. తమకు సినిమా రంగం ముఖ్యమే అన్న రేవంత్‌.. గద్దర్ అవార్డు ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని.. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఐతే బెనిఫిట్ షోలు, టికెట్‌ ధరల పెంపు విషయంలో.. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టబడి ఉన్నామని.. మిగతా అంశాల్లో మాత్రం సినిమా ఇండస్ట్రీకి పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పుడు కావాలన్నా.. ఇండస్ట్రీ వాళ్లు వచ్చి తనను కలవొచ్చని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా లెవల్‌లో తెలుగు సినిమాకి గౌరవం ఉందని.. తెలుగు సినిమాను ఇండియా లెవల్‌లో కాకుండా ప్రపంచస్థాయిలో చూడాలని సీఎం భావించారని.. FDC చైర్మన్‌ దిల్ రాజు చెప్పారు. త్వరలో సీఎంతో మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

CM Revanth Reddy Tollywood Meet

CM Revanth Reddy Tollywood Meet (Photo Credit : Facebook)

ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ పెరిగినట్లు జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని.. దిల్ రాజు చెప్పారు. ఇదంతా ఎలా ఉన్నా.. సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం.. ఆ తర్వాత పరిణామాలతో.. సర్కార్ వర్సెస్‌ సినిమా అన్నట్లు యుద్ధం కనిపించింది. ఐతే ఇప్పుడు ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌తో జరిగిన భేటీలో.. చాలా విషయాలపై క్లారిటీ వచ్చిందని.. ఇంకొన్ని విషయంలో చాకచక్యంగా రాజీ కుదిరిందనే ప్రచారం జరుగుతోంది.

 

Also Read : ఆదిలాబాద్ కాంగ్రెస్‌‌లో కొత్త టెన్షన్ ఏంటి..? ఆ నేతల రాజకీయ భవిష్యత్‌ను కారు చీకట్లు కమ్ముతున్నాయా?