Eatala Rajendar: బీజేపీలో ఆగని ఆధిపత్య పోరు..! ఆ ముగ్గురు టార్గెట్ గా ఈటల ఈటెలు..! ఎందుకు..
ఆ ముగ్గురికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈటల ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఆఫీస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
- ఈటల Vs బండి సంజయ్..ఆగని ఆధిపత్య పోరు
- లేటెస్ట్గా ఈటల చేసిన వ్యాఖ్యలపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్
- పేరు చెప్పుకుండానే బండిసంజయ్‌పై ఈటల ఈటెలు
Eatala Rajendar: బీజేపీలో కరీంనగర్ కొట్లాట హాట్ టాపిక్‌గా మారింది. వన్స్ మోర్ అంటూ ఎంపీ ఈటల రాజేందర్ బ్లాస్టింగ్ కామెంట్స్ చేసి చర్చకు తెరదీశారు. కాస్త గ్యాప్ ఇచ్చినట్లు ఇచ్చి..మీడియా ముందుకొచ్చిన ఈటల..బండి సంజయ్ పేరు తీయకుండానే..ఆయననే టార్గెట్ చేసినట్లు మాట్లాడారు. హుజురాబాద్ సెంట్రిక్‌గా ఆ ఇద్దరి ఫైట్ నడుస్తూనే ఉంటుందా? ఈటల లేటెస్ట్ కామెంట్స్‌ను ఎలా అర్థం చేసుకోవచ్చు? బీఆర్ఎస్లోకి పోను అంటూనే..సొంత పార్టీ నేతలను టార్గెట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు?
అంతర్గత పోరు. ఆధిపత్య పోకడలు. నేతలు రచ్చకెక్కడం. ఇదంతా కాంగ్రెస్‌లో కామన్ అనే టాక్ ఉండేది. కానీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీలో కూడా నేతలు..సంచలన స్టేట్మెంట్లకు, వివాదాస్పద కామెంట్లకు కేరాఫ్‌గా మారుతున్నారు. పార్టీలో నేతలు చేసే కామెంట్లు అంతర్గత చర్చకు దారి తీయడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. కరీంనగర్లో ఈటల రాజేందర్ Vs బండి సంజయ్ కోల్డ్‌వార్ రెగ్యులర్ ఎపిసోడ్ అయిపోయింది.
లోకల్ ఫైట్ సందర్భంగా రచ్చకెక్కి ఆ తర్వాత సైలెంట్ అయి..ఎన్నికల తర్వాత మరోసారి రచ్చ చేసి కమలం గూటిలో కాకరేపుతున్నారు ఆ ఇద్దరు నేతలు. ఇప్పుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ డిస్కషన్‌గా మారాయి. ఈ మధ్య పార్టీలోని ఇంటర్నల్ అంశాలపై ఓ కేంద్ర మంత్రి పార్టీ, మరో ఎంపీపై ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారన్న వార్త హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా అవుతున్నాయి.
ఆదివారం నాడు మల్కాజ్రి ఎంపీ ఈటల రాజేందర్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన మాటలు..చేసిన విమర్శలు ఇతర పార్టీలోని నేతలపై కన్నా సొంత పార్టీ నేతలకే ఎక్కువగా తాకాయన్న చర్చ జరుగుతోంది. హుజురాబాద్‌కు నువ్వు ఎంపీ కాదు..ఆ నియోజకవర్గంలోని మీ ఎంపీ పరిధిలోకి రాదు..మీరు అక్కడికి వెళ్లొద్దంటూ పార్టీ ఆదేశించింది. దానితో నేను అక్కడికి వెళ్లడం మానేశాను. దీంతో అక్కడ మేము ఎప్పుడూ ఓడిపోని మున్సిపల్ స్థానాలను, సర్పంచ్ సీట్లను కోల్పోయామంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఆ పోస్టర్ల వెనుక సొంత పార్టీ నేతలు?
ఈటల రాజేందర్ ఇన్ డైరెక్ట్‌గా బండి సంజయ్‌ని ఉద్దేశించి ఆయన నాయకత్వాన్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఓపెన్ సీక్రెట్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అంతటితో ఆగకుండా కొంతమంది తాను పార్టీ నుంచి వెళ్లిపోతున్నానంటూ పోస్టర్లు వేయిస్తున్నారని దీని వెనక తమ సొంత పార్టీ నేతలు ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల నరేంద్ర మోదీకి కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రహస్యంగా లేఖ రాశారన్న దానిపైనా ఈటల రియాక్ట్ అయ్యారు. మోదీకి లేఖ రాస్తే తప్పేముంది..మా నాయకుడు నరేంద్ర మోదీ..సమస్యలు ఉంటే ఆయనకు చెప్పుకోవడంలో తప్పేం లేదన్నట్లుగా సమర్ధించుకుంటూ వచ్చారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో సీఎస్ఆర్ ఫండ్స్‌ను కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాత్రమే వాడుకుంటున్నారని..మిగతా నేతలకు సీఎస్ఆర్ ఫండ్స్ రావడం లేదంటూ ఆగ్రహంగా ఉన్నారట నేతలు. అయితే సీఎస్ఆర్ ఫండ్స్‌తో పాటు పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలపై కూడా లేఖ రాశారన్న వార్తలకు ఈటల చేసిన వ్యాఖ్యలు కన్ఫామ్ చేస్తున్నాయి.
గెలుపు గుర్రాలకే టికెట్లు..
ఈటల ఇండైరెక్టుగా పార్టీ నేతలకు హెచ్చరికలు చేసినట్లుగా పార్టీ ఆఫీస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. GHMCతో పాటు జరిగే CMC, MMC కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈటల హుజురాబాద్ ప్రస్తావన తెచ్చినట్లు టాక్ నడుస్తోంది. తనను హుజురాబాద్ వెళ్లొద్దన్నారు..వెళ్లకుండా ఉన్నాను. ఇప్పుడు మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత తనదే అంటూ ఇండైరెక్టుగా ప్రకటించుకున్నట్లుగా చర్చించుకుంటున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాను..బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల నాయకులను తీసుకొని టికెట్లు ఇస్తానంటూ ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయట.
గ్రేటర్లో ఆ ముగ్గురికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే అలాంటి కామెంట్స్?
మూడు కార్పొరేషన్ల పరిధిలో ఉన్న ఎంపీలమైన రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తాను ముగ్గురం కలిసి మూడు కార్పొరేషన్ పరిధిలోని అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నామంటూ ఆయన ప్రకటించారు. మరి పార్టీ సీనియర్లైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలో పట్టున్న నాయకులు. వారిని విస్మరించడం ఏంటనే చర్చ సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావుది కూడా మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం కావడం ఆయనను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారిందట. బండి సంజయ్‌కి కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫాలోవర్స్ ఎక్కువనే ఉన్నారు. వీరి ముగ్గురికి గ్రేటర్లో చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈటల ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఆఫీస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎన్నికల్లో ఈటలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read: టీఆర్ఎస్.. కవిత పార్టీ పేరు ఇదేనా? రాజకీయవర్గాల్లో ఉత్కంఠ.. బీఆర్ఎస్లో గుబులు దేనికి?
