జీవన్ రెడ్డి జగడం వెనక అసలు సీక్రెట్ వేరే ఉందా?
వివాదం వెనక జీవన్ రెడ్డి ప్లాన్ నిజమే అయితే.. అది వర్కౌట్ అవుతుందా లేదా.. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Jeevan Reddy Vs Mla Sanjay (Photo Credit : Google)
Gossip Garage : జగిత్యాల జంక్షన్‌లో.. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం స్టక్ అయిపోయింది. పార్టీ ఫిరాయింపులపై సొంత వాళ్ల నుంచే వ్యతిరేకత రావడం.. అధికార పార్టీకి మింగుడు పడకుండా తయారయింది. ఓ మాట అనేసి ఊరుకున్నారా అంటే.. ఏఐసీసీ అధినేతకే లేఖ రాసి ఇంకో బాంబ్ పేల్చారు. రెండు మూడు రోజుల్లో నార్మల్ అవుతుందిలే అనుకున్న పంచాయితీపై.. తగ్గేదే లే అంటున్నారు జీవన్ రెడ్డి.. పట్టిన పట్టు వీడడం లేదు. జీవన్ జగడం వెనక అసలు కారణం ఏంటి.. పైకి ఆధిపత్య పోరులా కనిపిస్తున్నా.. అసలు సీక్రెట్ వేరే ఉందా.. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్న గుసగుసలు ఏంటి..
సొంత పార్టీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు..
పైకి కనిపించే నువ్.. నువ్ కాదు. రాజకీయాలకు పక్కాగా సరిపోయే మాట ఇది. రాజకీయాన్ని లెక్కేయడం, రాజకీయ లెక్కలు తీయడం అయ్యే పని కాదు. పాలిటిక్స్ అంత ఈజీగా అంతు చిక్కవ్. పొలిటికల్ లీడర్లు ఓ మాట మాట్లాడారంటే.. వినిపించని ఇంకా చాలా మాటలు, వ్యూహాలు.. ఆ మాటల వెనక ఉన్నాయని అర్థం. జగిత్యాల రాజకీయం చూస్తే ఇదే అనిపిస్తోంది. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యోదంతం.. తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ వ్యవహారంపై రచ్చ చేస్తున్నారు. బాధిత కుటుంబం కోసం రోడ్డెక్కి ఆందోళన చేయడం వరకు ఓకే.. కానీ సడెన్‌గా పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అందుకున్నారు. సొంత పార్టీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఏకంగా పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. దీంతో కాంగ్రెస్ రాజకీయం అంతా.. ఇప్పుడు జగిత్యాల గల్లీల్లోనే తిరుగుతోంది.
అప్పుడు అంటుకున్న నిప్పు.. ఇప్పుడు అగ్ని..
కాంగ్రెస్ భారీగా చేరికలను ప్రోత్సహించింది. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు.. హస్తం గూటికి చేర్చుకున్నారు. చేరికలు జరిగిన ప్రతీచోట ఏదో రచ్చ కనిపిస్తున్నా.. జగిత్యాల వివాదం మాత్రం పీక్స్‌కు చేరింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్.. ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు అంటుకున్న నిప్పు.. ఇప్పుడు అగ్నిలా మారింది. జీవన్‌రెడ్డి రగిలిపోయేలా చేస్తోంది. దీంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నట్లుగా జిల్లాలో పరిస్థితి మారింది.
ఎమ్మెల్యే పెత్తనం పెరుగుతుందని.. జీవన్‌రెడ్డి కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. గంగారెడ్డి హత్యతో.. ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హత్య కేసు నిందితుడు నిందితుడు ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడని.. ఆయన అండ చూసుకొనే హత్య చేశారన్నది జీవన్ రెడ్డి ఆరోపణ. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. జీవన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. దీంతో జగిత్యాల రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
హత్యపై రచ్చ జరుగుతుండగానే కొత్త టర్న్..
గంగారెడ్డి హత్యపై రచ్చ జరుగుతుండగానే.. కొత్త టర్న్ తీసుకున్నారు జీవన్ రెడ్డి. అసెంబ్లీలోని సీఎల్పీ వేదికగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. పార్టీ తీరుపై దుమ్మెత్తిపోశారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించి.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్నిఇరకాటంలోకి నెట్టారు. కాంగ్రెస్‌కు ఆదర్శం రాహుల్ గాంధీనా.. లేదంటే కేసీఆరా అని కామెంట్స్ చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై హాట్ కామెంట్లు చేశారు.
గత సర్కార్‌లో ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తికి ప్రభుత్వ సలహాదారు పోస్టు ఇస్తారా.. ఫిరాయింపులు ఎలా చేయాలన్న సలహాలు తీసుకోవడానికే ఆ పదవి ఇచ్చారా అంటూ పోచారం టార్గెట్‌గా ఘాటు విమర్శలు చేశారు జీవన్ రెడ్డి. అటు ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారడంపై కూడా జీవన్ రెడ్డి ఓ రేంజ్‌లో కౌంటర్లు వేశారు. ఐతే పార్టీ మారితే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి.. ఇలా విమర్శలు చేయిస్తారా అంటూ జీవన్‌రెడ్డి తీరుపై.. ఎమ్మెల్యేలు పోచారం, సంజయ్ రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది ఇప్పుడు హస్తం పార్టీకి తలపోటుగా మారింది.
రాజకీయంగా నిలదొక్కుకోవచ్చనే ఆలోచనలో జీవన్ రెడ్డి..
గంగారెడ్డి హత్య.. ఫిరాయింపుల మీద సొంత పార్టీలో రేగిన రగడ.. ఇవన్నీ ఎలా ఉన్నా.. జీవన్ రెడ్డి మాటల వెనక అసలు వ్యూహం వేరే ఉంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. జీవన్ రెడ్డి ఇలా కావాలని రచ్చ చేయడం వెనక అసలు కారణం వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే మార్చిలో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ఇప్పటికే క్లియర్‌కట్‌గా చెప్పేశారు. ఎమ్మెల్సీగా పదవి ముగిస్తే.. అది తన రాజకీయ జీవితానికే ప్రమాదంగా మారే అవకాశం ఉందనే ఆందోళనలో ఉన్నారట జీవన్ రెడ్డి.
అందుకే తన రాజకీయ భవిష్యత్ ఏంటో నిర్దేశించాలంటూ… ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. వచ్చే మార్చి నుంచి మే వరకు మండలిలో దాదాపు 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయ్. అందులో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలనే డిమాండ్‌ను ప్రధానంగా పార్టీ ముందు పెడుతున్నారట. ఎమ్మెల్సీగా మళ్లీ అవకాశం వస్తే.. రాజకీయంగా నిలదొక్కుకోవచ్చనే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నారట.
అది వర్కౌట్ అవుతుందా లేదా..?
జీవన్ రెడ్డి అసలు వ్యూహం ఇదే అంటూ జరుగుతున్న ప్రచారంతో.. రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. కనిపించేదేదీ నిజం కాదు.. కనపడనిది ఏదీ అబద్దం కాదు అంటే ఇదేనేమో బహుశా అని చర్చించుకుంటూ నిట్టూరుస్తున్నారు జనాలు. ఏమైనా జీవన్ రెడ్డి వ్యవహారం.. హస్తానికి గాయం చేస్తోంది. అటు ఎమ్మెల్యేల అసంతృప్తి.. ఇటు ఎమ్మెల్సీ ఆగ్రహం.. ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. వివాదం వెనక జీవన్ రెడ్డి ప్లాన్ నిజమే అయితే.. అది వర్కౌట్ అవుతుందా లేదా.. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.
Also Read : ఫస్ట్ అరెస్ట్ ఆయనదేనా..? దివాలీలోపు తెలంగాణలో ఏం జరగబోతోంది?