కాంగ్రెస్ మరో బిగ్ స్కెచ్..! ఉమ్మడి వరంగల్ జిల్లాపై స్పెషల్ ఫోకస్..

రాష్ట్రంలో మిగిలిన ఏ జిల్లా వారికి ఇవ్వనన్ని పదవులను వరంగల్ కు కట్టబెట్టారు గులాబీ బాస్ కేసీఆర్.

కాంగ్రెస్ మరో బిగ్ స్కెచ్..! ఉమ్మడి వరంగల్ జిల్లాపై స్పెషల్ ఫోకస్..

Gossip Garage : బీఆర్ఎస్ఎల్పీ విలీనమే టార్గెట్‌ పెట్టుకున్న కాంగ్రెస్… ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత పదునెక్కిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలకు.. మరోవైపు ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్న హస్తం … ఒక్కో జిల్లాలో కారు పార్టీని ఖాళీ చేయడమే వ్యూహంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాను దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన కాంగ్రెస్… ఇప్పుడు వరంగల్ ఫై పోకస్ పెంచినట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని ఎమ్మెల్సీలందరినీ ఒకేసారి హస్తం గూటికి చేర్చుకునేందుకు బిగ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాపై స్పెషల్ ఫోకస్..
తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను కలుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్.. ఆపరేషన్ ఆకర్ష్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్… ఇప్పుడు మరికొందరితో టచ్ లోకి వెళ్లిందంటున్నారు. మండలిలో బీఆర్ఎస్‌ పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తుండటంతో… జిల్లాల వారీగా ఆపరేషన్ స్టార్ట్ చేసిందట… ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన చల్లా వెంకట్రామిరెడ్డితో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పెద్దలు.. ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ చేశారంటున్నారు. ఈ జిల్లాల్లో బీఆర్ఎస్‌కు ఆరుగురు ఎమ్మెల్సీలు ఉండగా, ఇప్పటికే ఒకరు కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన ఐదుగురిలో ముగ్గురితో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతుండగా… ఇందులో ఇద్దరు హస్తం పార్టీ గూటికి చేరేందుకు దాదాపు సిద్ధమైపోయినట్లు సమాచారం.

ఏ జిల్లా వారికి ఇవ్వనన్ని ఎమ్మెల్సీ పదవులు వరంగల్ కు..
ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్‌కు గట్టిపట్టున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎమ్మెల్సీ పదవుల్లో అగ్రతాంబూలమే దక్కింది. రాష్ట్రంలో మిగిలిన ఏ జిల్లా వారికి ఇవ్వనన్ని ఎమ్మెల్సీ పదవులను వరంగల్ కు కట్టబెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. తనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్ఎస్ సీనియర్ నేత తక్కపల్లి రవీందర్రావు, కేటీఆర్ స్నేహితుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డితోపాటు మండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాశ్‌కు ఈ జిల్లా నుంచి అవకాశం ఇచ్చారు. వీరిలో బస్వరాజు సారయ్య రాత్రికి రాత్రే కాంగ్రెస్ కండువా కప్పేసుకోగా, మిగిలిన ఐదుగురిలో ముగ్గురితో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోందంటున్నారు.

సీఎం రేవంత్ సూచనతో యాక్టివ్ అయిన సురేందర్ రెడ్డి..
వరంగల్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్సీను పార్టీలో చేర్చుకునే బాధ్యతను సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్.సురేందర్ రెడ్డికి అప్పగించినట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో పెద్ద యాక్టివ్‌గా లేని సురేందర్ రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి సూచనతో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కాంగ్రెస్ లో చేరేలా ఆయనే తెరవెనుక మంత్రాంగం నడిపారని అంటున్నారు. ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్సీలను చేర్చుకునే పని కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

సత్యవతి రాథోడ్‌ చేరిక దాదాపు ఖాయం..!
ప్రస్తుతం ముగ్గురితో టచ్ లోకి వెళ్లిన కాంగ్రెస్… ప్రధానంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌పై ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు వీరవిధేయురాలిగా గుర్తింపు పొందిన సత్యవతి రాథోడ్ గతంలో టీడీపీలో పని చేయడంతో.. ఆమెను కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సత్యవతి రాథోడ్ గాడ్‌ఫాదర్‌ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరడంతో ఆమె కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోతారనే టాక్ వినిపిస్తోంది. ఆమె పదవీకాలం కూడా త్వరలో ముగుస్తున్నందున కాంగ్రెస్ లో చేరితో మరో అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితోనూ సత్యవతి రాథోడ్‌కు మంచి సంబంధాలే ఉండటంతో ఆమె చేరిక దాదాపు ఖాయమని తెలుస్తోంది.

అదే ప్రాధాన్యం కాంగ్రెస్ లో ఇస్తారా?
ఇదేవిధంగా గులాబీ దళపతి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావుతోనూ కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్న రవీందర్రావు… పార్టీ మార్పుపై తర్జనభర్జన పడుతున్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ లో తనకు ఎంతో ప్రాధాన్యం లభించిందని… అదే ప్రాధాన్యం కాంగ్రెస్ లో ఇస్తారా? అనే సందేహంతో ఆయన పార్టీ మారేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

రేపో మాపో కాంగ్రెస్ లో చేరడం గ్యారెంటీ..!
దీంతో కాంగ్రెస్ ఇప్పుడు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌పై ఫోకస్ పెట్టింది. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన ప్రకాశ్… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇటీవల వరంగల్ లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ ని ప్రత్యేకంగా కలిశారు ఎమ్మెల్సీ ప్రకాశ్. దీంతో ఆయన బీఆర్ఎస్‌ను వీడటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీపై గాలం వేస్తున్న కాంగ్రెస్ కనీసం ముగ్గురిని చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆరుగురు ఎమ్మెల్సీల్లో సారయ్య ఇప్పటికే కాంగ్రెస్ లో చేరగా, కేసీఆర్ సన్నిహితుడు మధుసూదనాచారి, కేటీఆర్ స్నేహితుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మినహాయించి మిగిలిన వారితో విస్తృతంగా చర్చలు జరుపుతోంది. ఇందులో రవీందర్రావు తప్ప మిగిలిన ఇద్దరు నేడో.. రేపో పార్టీ మారడం గ్యారెంటీ అని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

Also Read : ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని భయపెడుతున్న ఆ సెంటిమెంట్ ఏంటి?