అంతమంది ఎమ్మెల్యేలు ఒకేసారి ఢిల్లీ వెళ్లడానికి కారణమేంటి? బీఆర్‌ఎస్ నేతల హస్తిన యాత్రపై ఎన్నో అనుమానాలు..
ఈ మధ్య తన విమర్శల దాడిని మరింత పెంచి కేసీఆర్‌కు గవర్నర్ పదవి... కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారంటూ మరింత మసాలా దట్టించింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నా... కాంగ్రెస్ మాత్రం తన ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది.

Gossip Garage : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఢిల్లీ టూర్ తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్ అవుతోంది. ఎన్నడూ… ఎప్పుడూ లేనట్లు కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్రకు వెళ్లారు… అంతమంది ఎమ్మెల్యేలు ఒకేసారి ఢిల్లీ వెళ్లడానికి కారణమేంటి? బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు దేశ రాజధానిలో పనేం ఉంది? కీలక రాజకీయ పరిణామాలకు హస్తిన వేదిక కాబోతోందా?
తెలంగాణకు సంబంధించి ఏమైనా సంచలన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు ఢిల్లీ యాత్రపై తెలంగాణ పాలిటిక్స్‌లో ఉత్కంఠ నెలకొంది. పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లడంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు సంబంధించి ఏమైనా సంచలన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? అంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆరా తీస్తున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఒకేసారి ఢిల్లీకి వెళ్లలేదు. పార్టీ పిలుపు మేరకు ఏ ధర్నానో నిర్వహిస్తేనే ఇలాంటి టూర్ ఉండేది. కానీ, ఇప్పుడు అలాంటి ధర్నా పిలుపు లేకపోయినా గులాబీ దళం అంతా ఒకేసారి కట్టకట్టుకుని వెళ్లడమే అనుమానాలకు తావిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చాలామందికి బెయిల్..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. అయితే ఈడీ కేసుల వల్ల కేజ్రీవాల్ ఇంకా జైల్లో ఉన్నప్పటికీ మనీశ్ సిసోడియా మాత్రం బయటకు వచ్చారు. అదేవిధంగా ఈ కేసులో ఇతర నిందితుల్లో చాలామందికి బెయిల్ వచ్చింది.
కవితకు స్వాగతం పలికేందుకా? మెరుపు ధర్నా చేసేందుకా?
ఒక్క కవిత మాత్రం ఐదు నెలలుగా జైల్లోనే ఉండిపోయారు. ఆమె ఆరోగ్యం క్షీణించిందని తాజాగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఆమె న్యాయవాదులు. ఇప్పటికే కేసులో కొందరు నిందితులకు బెయిల్ రావడం, కవిత అనారోగ్య కారణాల వల్ల ఆమెకు బెయిల్ లభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ సమాచారం ఉండటంతోనే ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చి కవితకు స్వాగతం పలకాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ బెయిల్ రాని పక్షంలో కేంద్రం తీరుకు నిరసనగా ఢిల్లీలో ఆకస్మికంగా ధర్నాకు దిగాలని కేటీఆర్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవులు అంటూ కాంగ్రెస్ ప్రచారం..
కవిత బెయిల్ ఇష్యూతోపాటు పార్టీని కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న మరో అంశానికి ఢిల్లీ వేదికగా ఫుల్‌స్టాప్ పెట్టాలనే కారణంతో పక్కా స్కెచ్ వేసుకుని కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలో అడుగుపెట్టినట్లు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం కాబోతోందని ప్రచారం మొదలుపెట్టింది అధికార కాంగ్రెస్. ఈ మధ్య తన విమర్శల దాడిని మరింత పెంచి కేసీఆర్‌కు గవర్నర్ పదవి… కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారంటూ మరింత మసాలా దట్టించింది.
ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నా… కాంగ్రెస్ మాత్రం తన ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. దీంతో ప్రజల్లో రకరకాల అపోహలు పెరిగిపోతున్నాయంటున్నారు. ఈ ప్రచారానికి వీలైనంత తొందరగా బ్రేక్ వేయకపోతే పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు కేటీఆర్, హరీశ్‌రావు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.
ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా ఒకేసారి రెండు లక్ష్యాలను చేరుకోవాలని వ్యూహం..
కవితకు బెయిల్ దక్కని పక్షంలో ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా ఒకేసారి రెండు లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్నారట కేటీఆర్. కవితకు బెయిల్ రాకుండా కేంద్రం అడ్డుకుంటోందని చాటడం ద్వారా కాంగ్రెస్ ప్రచారానికి బ్రేక్ వేయడంతోపాటు బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటామని సంకేతాలు పంపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని బీఆర్‌ఎస్ చెబుతున్నప్పటికీ… కమలనాథుల ఆశీస్సులతో కవితను అరెస్టు చేయలేదని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు అందరికీ బెయిల్ ఇచ్చి కవితకు మాత్రమే ఇవ్వలేదన్న విషయాన్ని చాటి చెప్పాలంటే… ఢిల్లీలో ఆందోళన నిర్వహించడం ఒక్కటే మార్గమని నిర్ణయించిందట బీఆర్‌ఎస్.
Also Read : ఏపీలో వైసీపీతో, తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో స్నేహమే దెబ్బతీసిందా? నాగార్జునపై సీఎం రేవంత్‌కు కోపమెందుకు..!
బీజేపీతో సంబంధాలు లేవని చాటుకునే ప్రయత్నాలు..
అందుకే 20 మంది ఎమ్మెల్యేలు హస్తినలో వాలిపోయారంటున్నారు. ఏది జరిగితే తమ మంచికే అన్నట్లు భావిస్తున్న బీఆర్‌ఎస్…. కవితకు బెయిల్ వస్తే ఘన స్వాగతం పలికేందుకు.. లేదంటే ధర్నాతో రాజకీయంగా కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఢిల్లీ టూర్‌ను వాడుకోవాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే ముందుగా ఏ సమాచారం చెప్పకుండా ఢిల్లీకి వచ్చారంటున్నారు.