ఏపీలో వైసీపీతో, తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో స్నేహమే దెబ్బతీసిందా? నాగార్జునపై సీఎం రేవంత్‌కు కోపమెందుకు..!
మెగాస్టార్ ఫ్యామిలీ, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ఈ మూడు కుటుంబాలతోనూ సత్సంబంధాలు ఉన్నప్పటికీ నాగార్జున విషయంలో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోకపోవడమే చర్చనీయాంశమవుతోంది.

Gossip Garage : ఎక్కడో తేడా కొట్టింది… ఏదో జరిగింది… ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే… కింగ్‌పై సీఎంకు కోపమెందుకు? నిబంధనల అతిక్రమణ అన్నది సరైన రీజనేనా? రాజకీయ కారణాలు ఉన్నాయా? బీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉన్నారనా..? వైసీపీకి ఫేవర్ చూపారనా? చట్టం తన పని తాను చేసుకుపోయిందా? ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక అసలు కథ ఏంటి?
నాగార్జున ఎన్.కన్వెన్షన్ కూల్చివేతలో రాజకీయ కోణం?
హైదరాబాద్‌లో చెరువు ఆక్రమణల కూల్చివేతలతో హల్‌చల్ చేస్తోన్న హైడ్రా… హీరో నాగార్జున ఎన్.కన్వెన్షన్‌ను నేలమట్టం చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్.కన్వెన్షన్ ఆక్రమణలపై చాలా కాలంగా ఫిర్యాదులు, వివాదాలు ఉన్నప్పటికీ హైడ్రా ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే ఓ సెలబ్రెటీని టార్గెట్ చేయడమే చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరంలో చాలామంది బడా బాబులు, రాజకీయ నేతల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. సుమారు నెల రోజులుగా 18 ప్రాంతాల్లో ఆక్రమణలను గుర్తించి 44 ఎకరాలకు విముక్తి కల్పించింది. ఇదంతా చట్ట పరిధిలో జరిగిందా? లేదా? అనే అంశంపైన.. ఇందులో రాజకీయ కోణంపైన ఎవరికి తోచిన విధంగా వారు చర్చిస్తున్నారు. ఐతే హీరో నాగార్జున ఎన్.కన్వెన్షన్‌లో ఆక్రమణల తొలగింపులో కచ్చితంగా రాజకీయ కోణం ఉందనే టాక్ వినిపిస్తోంది.
అప్పట్లో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో నాగార్జున మాజీ కోడలు సమంత..
ఎన్.కన్వెన్షన్‌లో ఆక్రమణలు ఉన్నాయని 2014లోనే గుర్తించింది అప్పటి ప్రభుత్వం. కానీ, తన పలుకుబడి వల్లో… న్యాయ పోరాటం వల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపగలిగారు నాగార్జున. ఇదే సమయంలో అప్పటి నుంచి నాగార్జునకు గత ప్రభుత్వంలో పెద్దలకు సత్సంబంధాలు ఏర్పడ్డాయంటున్నారు. దీనిలో భాగంగానే హీరో నాగార్జున మాజీ కోడలు సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా మెలగడం వల్లే ఎన్.కన్వెన్షన్ ఆక్రమణలను తొలగించడం లేదని టీడీపీ ఎమ్మెల్యేగా అప్పట్లో విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్‌రెడ్డి.
గత ప్రభుత్వంలో చూసీచూడనట్లు వదిలేసిన ఆక్రమణలపై రేవంత్ ఉక్కుపాదం..
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఎన్.కన్వెన్షన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, పలు అధికారిక కార్యక్రమాలకు వేదిక అవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. దీంతోనే సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వంలో చూసీచూడనట్లు వదిలేసిన ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారంటున్నారు. తాను టీడీపీలో ఉండగా విమర్శలు చేసిన నాగార్జున ఎన్.కన్వెన్షన్‌ను తొలగించి తన మాటల్లో విశ్వసనీయత ఉంటుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
వైసీపీతో అనుబంధమే కాంగ్రెస్ పెద్దల ఆగ్రహానికి కారణమైందా?
ఇక సినీ పరిశ్రమలో మిగతా నటులు, ఇతర పెద్దలు మాదిరిగా కాకుండా నాగార్జున రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. కానీ, ఎప్పుడూ ఆయన రాజకీయ లింకులపై ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో స్నేహంగా మెలిగిన నాగార్జున ఏపీలో వైసీపీతో సన్నిహిత సంబంధాలు నెరపారని అంటుంటారు. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని నాగార్జునకు ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎంపీగా పోటీ చేసే ఉద్దేశమేమీ లేదని అప్పట్లోనే తేల్చిచెప్పారు నాగార్జున. అయితే వైసీపీతో నాగార్జునకున్న ఈ అనుబంధం మాత్రం కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదనే చెబుతున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత నాగార్జున తమను పట్టించుకోలేదని కోపమా?
ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డితో స్నేహంగా మెలిగిన నాగార్జున… తెలంగాణ విభజన తర్వాత ఇక్కడి నేతలను పట్టించుకోలేదని కొందరు ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. అందుకే మంత్రి కోమటిరెడ్డి సైతం ఎన్.కన్వెన్షన్ ఆక్రమణలపై ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారంటున్నారు. ఈ కారణాలతోనే ఎన్.కన్వెన్షన్‌ఫై హైడ్రా చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటు టాలీవుడ్‌లోనూ.. అటు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ కూడా జరుగుతోంది.
Also Read : తెలంగాణలో రూట్ మార్చిన కాంగ్రెస్ పార్టీ సర్కారు.. గులాబీ నేతలకు కొత్త టెన్షన్!
బీఆర్‌ఎస్, వైసీపీతో ఉన్న సంబంధాల వల్లే సినీ పరిశ్రమలో ఒంటరి వారయ్యారా?
బీఆర్‌ఎస్, వైసీపీతో ఉన్న సంబంధాల వల్లే నాగార్జున సినీ పరిశ్రమలో ఒంటరి వారయ్యారని అంటున్నారు. ఆ రెండు పార్టీలు కూడా నాగార్జున తమ వాడు అని చెప్పుకోలేకపోతుండటంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారైంది నాగార్జున పరిస్థితి. టాలీవుడ్‌లో ప్రముఖ సినీ కుటుంబాలన్నీ ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ సర్కార్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీ, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ఈ మూడు కుటుంబాలతోనూ సత్సంబంధాలు ఉన్నప్పటికీ నాగార్జున విషయంలో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోకపోవడమే చర్చనీయాంశమవుతోంది. ఇలా రాజకీయంగా, పరిశ్రమపరంగా ఒంటరిగా మిగిలిన నాగార్జున న్యాయ పోరాటాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ఏదిఏమైనా హైడ్రా యాక్షన్‌తో కింగ్ పొలిటికల్ స్ట్రాటజీయే దెబ్బ కొట్టిందా? అన్న అనుమానాలే ఎక్కువయ్యాయి.