Miss World 2025: మిస్ ఇంగ్లండ్ తీవ్ర ఆరోణలపై విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం..

మిస్ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ ఆరోపణల్లో ఎంత నిజం ఉందన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

Miss World 2025: మిస్ ఇంగ్లండ్ తీవ్ర ఆరోణలపై విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం..

Updated On : May 25, 2025 / 11:11 PM IST

Miss World 2025: తెలంగాణలో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలపై మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నన్ను వేశ్యాలా చూశారు, నాతో అగౌరవంగా ప్రవర్తించారు అంటూ మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌పై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. అందులో నిజానిజాలు తెలుసుకోవాలంది.

సీనియర్‌ ఐపీఎస్‌ లు శిఖా గోయల్‌, రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను అడిగి పోటీల నిర్వహణ తీరు గురించి తెలుసుకుంటున్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అనేది ఆరా తీస్తున్నారు. మిస్ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉందన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. వీడియోలను సైతం రికార్డ్ చేస్తున్నారు. దేశ పరువు, ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని సీరియస్ గా తీసుకున్నారట. స్వయంగా ఎప్పటికప్పుడు విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారట.

కంటెస్టెంట్లతోపాటు.. మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ నుంచి సైతం పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు విచారణ అధికారులు. మిల్లా మాగీతో డిన్నర్‌లో ఎవరెవరు పాల్గొన్నారు, ఆరోజు ఆమెతో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలు సేకరించి దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది విచారణ బృందం.

మిల్లా మాగీ ఆరోపణలు తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తోందనే టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. నిజానిజాలు రాబట్టేందుకు పూర్తి స్థాయి దర్యాఫ్తు కోరింది. కాగా, మిల్లా మాగీ ఆరోపణలను మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ సీఈవో జూలియా మోర్లే ఖండించారు. ఆ వాదనలు నిరాధారమైనవన్నారు.

Also Read: కవిత కారు దిగాల్సిందే, బీఆర్ఎస్‌లో కొనసాగే అవకాశమే లేదిక- 10టీవీ ఇంటర్వ్యూలో ఈటల సంచలన వ్యాఖ్యలు..

మిల్లా మాగీ ఆరోపణలు అవాస్తవం- జయేశ్‌ రంజన్‌
మిస్‌ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌. మిస్ ఇంగ్లండ్ మాగీ కేవలం 8 రోజులే ఇక్కడున్నారని ఆయన తెలిపారు. ఆమె ఆరోపణల తర్వాత ఇతర పోటీదారులతో తాము మాట్లాడామన్నారు. ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదని వారు చెప్పారని ఆయన వెల్లడించారు. చౌమహాల్లా ప్యాలెస్ లో ఇచ్చిన విందులో మిస్ ఇంగ్లండ్‌తో పాటు మిస్ వేల్స్ అదే టేబుల్ దగ్గర ఉన్నారని, అక్కడ ఎవరూ తమతో తప్పుగా ప్రవర్తించలేదని మిస్ వేల్స్ చెప్పారని జయేశ్ రంజన్ తెలిపారు. అయితే, సెల్ఫీల కోసం ఎక్కువ మంది ప్రయత్నించడం మాత్రం కొంత ఇబ్బంది కలిగిస్తుందని కంటెంస్టెంట్లు తెలిపారని జయేశ్ రంజన్ పేర్కొన్నారు.

మిల్లా మాగీ ఏమని ఆరోపించారు?
”ఓ మంచి ఉద్దేశంతో నేను హైదరాబాద్ వెళ్లా. కానీ అక్కడ నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నన్ను ఒక వేశ్యలా చూశారు. కొందరు నాతో అగౌరవంగా ప్రవర్తించారు. వినోదం కోసం మమ్మల్ని వీధుల్లో తిప్పారు నిర్వాహకులు. ఇది చాలా అసౌకర్యంగా అనిపించింది. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలని ఒత్తిడి చేశారు. పురుష స్పాన్పర్ల ముందు పరేడ్ చేయించడం, విపరీతమైన మేకప్ వేసుకోవాలని సూచించడం, ఉదయం నుంచి రాత్రి వరకు ఈవినింగ్ గౌన్లు ధరింపజేయడం లాంటివి నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి” అంటూ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు మిల్లా మాగీ. అర్ధంతరంగా పోటీల నుంచి తప్పుకున్న మాగీ ‘ద సన్’ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ ఆరోపణలు గుప్పించారు.