BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల..

ఉదయం తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది.

BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల..

Cm Revanth Reddy

Updated On : September 26, 2025 / 10:28 PM IST

BC Reservations: తెలంగాణలో లోకల్ ఎలక్షన్ నగారా మోగనుంది. ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల చేసింది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9 ని విడుదల చేసింది. ఇటు రేపు ఉదయం తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది. సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులతో భేటీ కానున్న ఈసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. రేపు సాయంత్రానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది.
ఈ సమావేశానికి సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఇక ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖ విడుదల చేసింది.

తెలంగాణలో 12,760 పంచాయతీలు.. 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు.. 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు ఛైర్‌పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తారు.

అటు మండల, జిల్లా పరిషత్‌ల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ అయ్యింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీల రిజర్వేషన్ల విధానంపై పంచాయతీ రాజ్ శాఖ జీవో విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇచ్చింది. బీసీలకు కులగణన డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తూ జీవో విడుదల చేసింది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సిద్ధం చేసింది అధికార యంత్రాంగం. రేపు రాజకీయ పార్టీల సమక్షంలో డ్రా ద్వారా మహిళ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మండల, జిల్లా పరిషత్‌ లకు ముందుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశం ఉంది.

Also Read: ఏకంగా వరల్డ్‌ బ్యాంకుకే లేఖ రాసిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్‌లో కలకలం.. రాసింది ఇందుకేనా?