వరల్డ్ బ్యాంకుకు లేఖ రాసిన ఎమ్మెల్యే.. ఇదేం ట్విస్ట్.. రాసింది ఇందుకేనా?
రాష్ట్ర సర్కార్ ఖజానాలో నిధులు లేదని చెప్పాలనేదే ఎమ్మెల్యే ఉద్దేశమా అన్న చర్చ కూడా నడుస్తోంది.

MLA Madan Mohan Rao: కాంగ్రెస్ నేతల రూటే సెపరేటు. సొంతపార్టీ నేతలనైనా ఏకిపారేసే అంతర్గత ప్రజాస్వామ్యం హస్తం పార్టీ నేతల సొంతం. సొంత జిల్లాలో సీఎం సభలకు, సమీక్షలకు ఓ ఎమ్మెల్యే దూరంగా ఉంటారు.. మరో ఎమ్మెల్యే ప్రభుత్వాన్నే మార్చేద్దామంటారు. ఇంకో శాసనసభ్యుడు సొంత సర్కార్కు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తారు. ఇంకొకాయన ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను తప్పుబడుతారు. ఇలా ఆ నలుగురి రచ్చ నడుస్తుండగానే..ఇప్పుడింకో ఎమ్మెల్యే తీరు చర్చనీయాంశంగా మారింది.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విద్యావంతుడు. ఆయన ఐటీ మినిస్టర్ అవుతారంటూ కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈక్వేషన్స్ సెట్ కాకపోవడంతో ఆయనకు అమాత్య పదవి దక్కలేదనుకోండి.. అది వేరే విషయం. కానీ ఎమ్మెల్యే మదన్ మోహన్రావు రాసిన ఓ లేఖ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీస్తోంది. అయితే ఎమ్మెల్యే లేఖ రాసింది సీఎంకో లేక..సీఎస్కో..లేదా కేంద్రానికో కాదు.. ఏకంగా వరల్డ్ బ్యాంకుకు లేఖ రాశారు ఎమ్మెల్యే మదన్ మోహన్రావు. లేఖలో ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలు, అవసరాలు రాష్ట్రప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ను ఇరకాటంలో పడేసేలా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. (MLA Madan Mohan Rao)
Also Read: అందుకే “మెట్రో రైలు” నుంచి ఎల్ అండ్ టీ సంస్థను రేవంత్ రెడ్డి వెళ్లగొట్టారు: కేటీఆర్ సంచలనం
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గం పూర్తిగా దెబ్బతిందని, ప్రకృతి విపత్తు పరిహారం కింద రూ.100 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వరల్డ్ బ్యాంకుకు లేఖ రాశారు. గ్రామాలు ముంపుకు గురై పంటలు నాశనం కాగా, వందలాది ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసమై గ్రామాల మధ్య రవాణా సౌకర్యం దెబ్బతింది.
తాగునీటి వనరులు చెడిపోయి, విద్యాసంస్థలు కూడా నష్టపోయాయి. వీటన్నింటిని బాగు చేసేందుకు వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీకి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పునరావాసం, పునర్నిర్మాణం, భవిష్యత్ విపత్తులకు సన్నద్ధత కోసం కనీసం రూ.100 కోట్ల విపత్తు సహాయ నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అయితే ఎమ్మెల్యే డైరెక్టుగా వరల్డ్ బ్యాంకుకు లేఖ రాయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు ఏవైనా ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుంటాయి.
ప్రభుత్వాలే డైరెక్ట్గా వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థలతో కోఆర్డినేట్ చేసుకుని రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం వనరులు సమకూర్చుకుంటాయి. కానీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏకంగా తన నియోజకవర్గానికి నిధుల కోసం డైరెక్టుగా వరల్డ్ బ్యాంకుకు లేఖ రాయడం హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఓ నియోజకవర్గానికి వరల్డ్ బ్యాంకు నిధులు ఇవ్వడం ఎలా సాధ్యమన్న చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా వరల్డ్ బ్యాంకు వంటి సంస్థలు డైరెక్టుగా నిధులు ఇవ్వవన్న విషయం ఎమ్మెల్యేకు తెలియదా లేదా.. అన్నీ తెలిసే కావాలని లేఖ రాశారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
లేఖపై రకరకాలపై అభిప్రాయాలు
అయితే ఎమ్మెల్యే మదన్మోహన్ లేఖ ఇప్పుడు అధికార పార్టీలో.. ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోందట. ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వరల్డ్ బ్యాంకుకు లేఖ రాయడమేంటి? అని చర్చించుకుంటున్నారట. ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంకు రాసిన లేఖపై రకరకాలపై అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సొంత ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంక్కు లేఖ రాశారా అన్న విమర్శలు వస్తున్నాయి.
లేకపోతే సీఎం రేవంత్రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధికి సహరించడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర సర్కార్ ఖజానాలో నిధులు లేదని చెప్పాలనేదే ఎమ్మెల్యే ఉద్దేశమా అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే మదన్ మోహన్ లేఖ వెనుక సమ్థింగ్ ఈజ్ దేర్ అన్న ప్రచారం అయితే జరుగుతోంది. ఎల్లారెడ్డి టికెట్ ఇవ్వడం అప్పట్లోనే రేవంత్కు ఇష్టం లేదని..కానీ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుని మదన్మోహన్ రావు టికెట్ తెచ్చుకున్నారని కూడా చెప్తుంటారు.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మదన్ మోహన్ రావు మంత్రి కావాల్సి ఉన్నా సీఎం రేవంతే అడ్డుకున్నారన్న టాక్ నడిచింది. ఇవన్నీ కలగలిపి సీఎం రేవంత్, మదన్ మోహన్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందని అంటుంటారు. ఈ ప్రచారంలో వాస్తవమెంతుందో తెలియదు కానీ ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంకుకు రాసిన లేఖతో కొత్త కొత్త విషయాలు అయితే తెరమీదకు వస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే మాత్రం ఏదోలా తన నియోజకవర్గాన్ని, ప్రజలను ఏదోలా ఆదుకునేందుకే వరల్డ్ బ్యాంకులో పనిచేసే వారితో తనకున్న పరిచయాలతో తన ప్రయత్నం చేశానంటూ చెప్తున్నారట.చూడాలి ఎల్లారెడ్డికి వరల్డ్ బ్యాంకు రుణం దక్కుతుందా.. ఎమ్మెల్యే తీరును కాంగ్రెస్ నేతలు వివాదాస్పదం చేస్తారా చూడాలి మరి.