MLC elections: పట్టభద్ర ఓటర్లూ ఈ పొరపాట్లు చేయకండి.. అవగాహనతో ఓటేయండి.. ఈ విషయాలు తెలుసుకోండి..
రాష్ట్రంలో ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ..

MLC elections
MLC elections: మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతోపాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీలో నిలిచారు. అవే జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది పోటీలో మిగిలారు. ఇక.. ఖమ్మం- నల్గొండ – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
రాష్ట్రంలో ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే, ఒకటికి రెండు సార్లు ఓటువేసే విషయంలో విద్యాధికులు కూడా పొరపాట్లు చేస్తున్నారు. దీంతో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొన్ని ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇలా వేల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ క్రమంలో పట్టభద్ర ఓటర్లు ఓటు వేసే విషయంలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఇలా చేయండి..
♦ బ్యాలెట్ పత్రంలో పోలింగ్ సిబ్బంది ఇచ్చే ఊదా (వాయిలెట్) రంగు స్కెచ్ పెన్నుతోనే ఓటు వేయాలి.
♦ ఇతర పెన్ను, పెన్షిల్ ను ఉపయోగించొద్దు. టిక్ పెట్టడం, ఓకే అనే అక్షరాలు కూడా రాయకూడదు.
♦ మొదటి ప్రాధాన్యం ఇవ్వదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకెను వేయాలి.
♦ 1 అంకె వేయకుండా 2, 3, ఇతర సంఖ్యలను వేయకూడదు. కచ్చితంగా 1 అంకె ఎవరికైనా ఇవ్వాలి.
♦ అభ్యర్థుల్లో కచ్చితంగా 1 అంకె ఎవరికైనా వేయాలి. మిగతా అభ్యర్థులకు వేయడమనేది ఓటరు ఇష్టం.
♦ 1 అంకె తరువాత మిగతా 2, 3, 4 ఇలా నచ్చిన అభ్యర్థికి అంకెలను వారి పేరు పక్కన గడిలో వేయాలి.
♦ ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్య సంఖ్య మాత్రమే ఇవ్వాలి. ఒకే అంకెను ఇద్దరు ముగ్గురికి ఇవ్వొద్దు.
♦ భారతీయ అంకెలైన 1, 2, 3, 4, 5 లేదా రోమన్ అంకెలు వరుసగా నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యంగా వేయాలి.
♦ ఆంగ్లంలో వన్ అని.. ఓకె అని ఇతర గుర్తులు, పదాలు రాయకూడదు. కేవలం అంకెలను రాయాలి.
♦ బ్యాలెట్లో పేరు, సంతకం ఇతర అక్షరాలు ఏవి రాసినా అవి చెల్లవు. కేవలం అంకెలు వేయాలి.
♦ అభ్యర్థి, పేరు, ఫొటో పక్కన ఉన్న గడి మధ్యలోనే అంకె వేయాలి.
♦ అభ్యర్థి పేరున్న పేరుపైన టిక్ చేయొద్దు. వరుస సంఖ్యపైన మార్క్ చేయొద్దు.