Greater Hyderabad: గ్రేటర్‌లో విభజన చిచ్చు.. జిల్లాల్లో పునర్విభజన లొల్లి
సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి, నారాయణపేట, గద్వాల్..ఇలా పలు జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదనేది కాంగ్రెస్ నేతల వాదన.
Revanth Reddy (Image Credit To Original Source)
- గ్రేటర్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు సర్కార్ రెడీ?
- జిల్లాల పునర్విభజనపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం
- అధికారంలోకి వస్తే సికింద్రాబాద్ జిల్లా చేస్తామంటున్న కేటీఆర్
Greater Hyderabad: తెలంగాణ రాజకీయ సమరంలో..ప్రతి ఇష్యూ పెద్ద టాపిక్‌గానే మారుతుంది. ఈ క్రమంలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ విభజన..జిల్లా ల పునర్విభజన పొలిటికల్ ఫైట్‌కు దారితీస్తోంది. రేవంత్ సర్కార్ టార్గెట్‌గా బీఆర్ఎస్ విమర్శల దాడి చేయడమే కాదు..క్షేత్రస్థాయి ఆందోళనకు కూడా రెడీ అయిపోయింది.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం పెద్ద రచ్చ అయింది. అధికార పార్టీతో సహా విపక్ష పార్టీలన్నీ విలీనం ప్రక్రియపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయినా డోంట్ కేర్ అంటూ ముందుకెళ్తున్న రేవంత్ సర్కార్..విలీనం తర్వాత మళ్లీ విభజనకు శ్రీకారం చుట్టింది. 150 వార్డులను 300వార్డులుగా చేసి..100 వార్డులకో కార్పొరేషన్ చొప్పున గ్రేటర్‌ను మూడు ముక్కలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
Also Read: ఆ నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. సీనియర్ నేతను తప్పించి కొత్త నేతకు బాధ్యతలు
ఎన్నో అభ్యంతరాలు, మరెన్నో అబ్జక్షన్స్ మధ్య గ్రేటర్ విభజన ఆల్ మోస్ట్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే. ఇక ఆ ఇష్యూ అలా ఉండగానే జిల్లాల కుంపటిని ముందేసుకున్నారు సీఎం రేవంత్. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అడ్డగోలుగా జిల్లాలను విభజించారని..పప్పు, బెల్లం పంచిపెట్టినట్లు..అడిగినోళ్లందరికీ జిల్లాలు ఇచ్చేశారని విమర్శిస్తోంది కాంగ్రెస్.
ఈ క్రమంలోనే 33 జిల్లాలను పునర్విభజించడంతో పాటు సంఖ్యను తగ్గించేందుకు సూచనప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి అధ్యయనం చేసి.. మార్పులు, చేర్పులు చేస్తామంటోంది ప్రభుత్వం.
పలు జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదా?
సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి, నారాయణపేట, గద్వాల్..ఇలా పలు జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదనేది కాంగ్రెస్ నేతల వాదన. అందుకే 33 జిల్లాలను 25కు తగ్గించాలనే ఆలోచనకు వచ్చింది. అయితే రేవంత్ సర్కార్ జిల్లాల సంఖ్య తగ్గించే ఆలోచనపై..బీఆర్ఎస్ అప్పుడే వాయిస్ రేజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇటు గ్రేటర్‌లో సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం శాంతియుత ర్యాలీని చేపట్టింది బీఆర్ఎస్.
అంతేకాదు తాము అధికారంలోకి వస్తే సికింద్రాబాద్‌ను జిల్లాగా చేస్తామని ప్రకటించేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ప్రభుత్వం సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీస్తోందని..పదేళ్ల తర్వాత జిల్లాల పునర్విభజనతో కొత్త సమస్యకు తెరదీస్తుందని మండిపడుతున్నారు.
మరోవైపు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ప్రాంత ప్రజలు తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ బాట పట్టారు. హుజూరాబాద్ పట్టణ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసి..మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు ఈ గడ్డ బిడ్డ కావడంతో..ఆయన గౌరవార్థం పీవీ నరసింహారావు జిల్లా అని పేరు పెట్టాలని కోరుతున్నారు.
సీరియస్‌గా రియాక్ట్ అవుతున్న బీఆర్ఎస్ నేతలు
జిల్లాల పునర్విభజనపై బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, హరీశ్ సీరియస్‌గానే రియాక్ట్ అవుతున్నారు. పరిపాలన సౌలభ్యం..అధికార వికేంద్రీకరణ కోసం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే రేవంత్ సర్కార్..వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలతో పాటు మరికొన్నింటిని తొలగిస్తామని అంటుందని మండిపడుతోంది బీఆర్ఎస్. జిల్లాలను ముట్టుకుంటే అగ్గిపుట్టిస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటు గ్రేటర్‌లో విభజన.. అటు జిల్లాల్లో పునర్విభజన కొత్త చిచ్చును రాజేస్తోంది. తమ జిల్లాను మారిస్తే ఊరుకునేది లేదంటూ ఇప్పటికే స్థానికంగా మళ్లీ జేఏసీలు ఏర్పడుతూ ఉద్యమాలకు ప్లాన్ చేస్తున్నాయ్. సేమ్‌టైమ్ ఇటు బీఆర్ఎస్ కూడా జిల్లాల పునర్విభజనపై సీరియస్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. ఇప్పుడున్న 33 జిల్లాలను మారిస్తే ఊరుకునేది లేదని..ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని అంటోంది. ఈ నేపథ్యంలో విభజన, పునర్విభజన ఇష్యూ ఇంకెంత రాజకీయ రచ్చకు దారితీస్తుందో చూడాలి మరి.
