ఆ నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. సీనియర్ నేతను తప్పించి కొత్త నేతకు బాధ్యతలు

ఈ సారి ఇచ్చాపురంలో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ అధినేత జగన్ పట్టుదలతో ఉన్నారని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు.

ఆ నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. సీనియర్ నేతను తప్పించి కొత్త నేతకు బాధ్యతలు

YS Jagan (Image Credit To Original Source)

Updated On : January 17, 2026 / 9:16 PM IST
  • ఇచ్చాపురం వైసీపీలో కీలక పరిణామాలు  
  • ఈ సారి ఎలాగైనా ఇచ్చాపురంలో గెలవాలని ప్లాన్
  • టీడీపీకి కంచుకోటగా ఇచ్చాపురం నియోజకవర్గం 

Ichchapuram Constituency: ఏపీ పాలిటిక్స్‌లో ఇచ్చాపురం నియోజకవర్గం ప్రత్యేకతే వేరు. గేట్ వే ఆఫ్ ఆంధ్రాగా పేరుండటంతో పాటు..పాదయాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న ఇచ్చాపురం.. పొలిటికల్ సర్కిల్స్‌లో ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. ఇక ఇచ్చాపురం రాజకీయాలు కూడా అంతే రసవత్తరంగా ఉంటాయి. అయితే వైసీపీకి అందని ద్రాక్షగా మారిన నియోజకవర్గాల్లో ఇచ్చాపురం ఒకటి.

వైసీపీ ఎన్ని రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా..ఇచ్చాపురంలో వైసీపీ జెండా ఎగరడం లేదు. అయితే నేతల గ్రూపుల గోలనే దీనికి కారణమంటూ చెప్పుకొస్తారు సిక్కోలు వైసీపీ లీడర్లు. ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు.

టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇచ్చాపురం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది. అంతకుముందు కూడా కాంగ్రేసేతర అభ్యర్థులే ఎక్కువగా అక్కడ గెలుస్తూ వచ్చారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీవైపు మళ్లింది. కానీ టీడీపీ టీడీపీ ఓటు బ్యాంకు మాత్రం ఆ పార్టీకే ఉంది.

Also Read: జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో ఆగని సమరం.. మళ్లీ రాజుకుంటున్న వైరం..

ఫ్యాన్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇచ్చాపురం నుంచి 2014లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నర్తు రామారావు ఓటమి చెందగా..2019లో పిరియా సాయిరాజ్‌ను పోటీకి దింపింది వైసీపీ. అతను కూడా ఓటమి చెందడంతో 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సాయిరాజ్‌ను సమన్వయకర్తగా తప్పించి ఆ బాధ్యతలను ఆయన సతీమణి పిరియా విజయమ్మకు అప్పజెప్పారు. 2024 ఎన్నికల్లో విజయమ్మకి కూడా ఓటమి తప్పలేదు. దీంతో హ్యాట్రిక్ కొట్టారు బెందాళం అశోక్.

జగన్ పట్టుదలతో ఉన్నారా?
ఈ సారి ఇచ్చాపురంలో ఎలాగైనా పాగా వేయాలని అధినేత జగన్ పట్టుదలతో ఉన్నారని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. వచ్చే ఎన్నికల్లో ఇచ్చాపురం నుంచే వైసీపీ విజయ ఢంకా మోగించాలని పార్టీ నేతలకు టార్గెట్‌ ఫిక్స్ చేశారట వైసీపీ పెద్దలు. దానికి అనుగుణంగానే గేమ్ ప్లాన్ మారుస్తున్నారట. ఇచ్చాపురం నియోజకవర్గంలో జనాభా పరంగా రెడ్డిక సామాజిక వర్గంతో పాటు యాదవ, కళింగ, అగ్నికుల క్షత్రియ వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉంటున్నారు.

అయితే గత రెండుసార్లు..కళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్ కుటుంబానికే ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు జగన్. రెండో సామాజిక వర్గం అయిన యాదవ్‌కు ఎమ్మెల్సీని ఇచ్చారు. అయినప్పటికీ నేతల మధ్య పొసగడం లేదు. గ్రూపు రాజకీయాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి..తప్ప తగ్గడం లేదు. దీంతో మరో కొత్త నేతకు అవకాశం ఇచ్చారంటున్నారు అక్కడ క్యాడర్. సీనియర్ నేతలను పక్కన పెట్టి..గత ప్రభుత్వ హయాంలో రెడ్డిక కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన శ్యాంప్రసాద్ రెడ్డికి..ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారంటున్నారు.

శ్యాంప్రసాద్ రెడ్డికి బాధ్యతలు ఎందుకు ఇచ్చారు?
ఇచ్చాపురం వైసీపీ బాధ్యతలు శ్యాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందనే చర్చ జరగుతుంది. సిక్కోలు జిల్లాలో..ఎమ్మెల్యేగా ఉన్న బెందాళం అశోక్ కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో గత రెండు సార్లు కూడా కళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్ దంపతులను బరిలో దించింది. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

దీంతో నియోజకవర్గంలో అధిక జనాభా కలిగిన రెడ్డిక సామాజికవర్గంపై ఫోకస్ పెట్టిందట వైసీపీ. రెడ్డిక వర్గం డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా ఉండటంతో..ఈ సారి వైసీపీ పెద్దల ప్లాన్ వర్కౌట్ అవుతుందనే అంచనాలున్నాయట. ఇప్పటికే యాదవ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత నర్తు రామారావుకి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.

దీంతో రెడ్డిక, కళింగ, యాదవ సామాజిక వర్గాలు తమకి కలిసి వస్తాయన్న లెక్కల్లో వేసుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. అయితే గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఇచ్చాపురం వైసీపీలో శ్యాంప్రసాద్ రెడ్డి ఎలా నెగ్గుకు వస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తే తప్ప విజయం అంత ఈజీ కాదని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి వైసీపీ కొత్త స్కెచ్‌ ఎంతవరకు సక్సెస్ అవుతందో చూడాలి మరి.