TSPSC Group 2 Exam (File Photo)
Group2 Examination: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. మొత్తం 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఆది, సోమవారాల్లో పరీక్షలు జరగనుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుచి సాయత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం ఉదయం బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలాఏళ్ల తరువాత గ్రూప్2 పరీక్షలు నిర్వహిస్తున్నామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని, ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. గ్రూప్ 3 కంటే గ్రూప్2 పరీక్షలకు ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఫలితాలు త్వరలోనే ఇస్తామని అన్నారు.
Also Read: అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. సీఎం కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటి?
ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు. బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ముగ్గురిని అధికారులు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదు. ఇలా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు అధికారులు నో ఎంట్రీ అంటూ వెనక్కు పంపించేశారు. గ్రూప్2 అభ్యర్థి ఒకరు మాట్లాడుతూ.. ఐదు నిమిషాలు లేటుగా వచ్చానని, లోపలికి అనుమతించలేని ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు టైం లేక మా ఫ్రెండ్ ను హాల్ టికెట్ ఇవ్వమని చెప్పానని.. తాను గ్రూప్ 2కు హాల్ టికెట్ బదులుగా గ్రూప్3 హాల్ టికెట్ తెచ్చాడని తెలిపాడు. పరీక్షా కేంద్రం వద్దకు వచ్చాక చూసుకోగా.. గ్రూప్ 3 హాల్ టికెట్ ఉందని, దీంతో కానిస్టేబుల్ సహాయంతో హాల్ టికెట్ జిరాక్స్ తెచ్చుకున్నానని.. ఈ క్రమంలో ఐదు నిమిషాలు ఆలస్యమైందని, పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అధికారులు లోపలికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాతోపాటు ఓ దివ్యాంగుడు కూడా ఉన్నాడని, ఆయన్నుకూడా లోపలికి అనుమతించలేదని తెలిపాడు.
ఇదిలాఉంటే.. గ్రూప్2 పరీక్షకు మొత్తం 5.57లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు పరీక్ష జరగనుంది. రెండు రోజుల్లో మొత్తం నాలుగు పేపర్లకు కలిపి 600 మార్కులకు ఈ గ్రూప్2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇటీవల టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 16న రైల్వే పరీక్ష ఉందని.. ఈ క్రమంలో ఒకే రోజు గ్రూప్2, రైల్వే పరీక్షలు ఉన్నందున పరీక్షల తేదీలను మార్చాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది.