అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. సీఎం కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటి?

ఈ ప్రచారాలకు అనుగుణంగా అల్లు అర్జున్‌ అరెస్ట్‌ కక్ష సాధింపు చర్యే అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. సీఎం కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటి?

Allu Arjun

Updated On : December 14, 2024 / 8:54 PM IST

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎపిసోడ్‌ రోటిన్‌గా జరిగిపోయిందా.. లేదంటే అరెస్ట్ వెనుక రాజకీయ కోణం దాగి ఉందా.. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందా.. అసలు పుష్ప అరెస్ట్ వెనుక ఎందుకీ కన్ఫ్యూజన్. అరెస్ట్ నుంచి విడుదల వరకు.. సోషల్‌ మీడియా కామెంట్ల నుంచి సీఎం ప్రకటన వరకు ఎన్నో ఊహాగానాలు.. మరెన్నో అనుమానాలు.

ఒక్క అరెస్ట్.. రెండు రాష్ట్రాల రాజకీయాల్ని కుదిపేసింది. ఒక్క అరెస్ట్ తెలుగు ఇండస్ట్రీని కదిలివచ్చేలా చేసింది. ఒక్క అరెస్ట్ అనేక అనుమానాలకు సెంటర్ పాయింట్ అయ్యింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఈనెల 4న అక్కడ తొక్కిసలాట జరగ్గా పది రోజులు తర్వాత సినీ నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరిచూపు ఈ కేసు వైపు మళ్లింది. ఈ వ్యవహారం చుట్టూ రకరకాల చర్చలు, ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఖండిస్తున్న ప్రతిపక్ష పార్టీలు 
అల్లు అర్జున్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందనే ప్రచారం తెగ వైరల్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా రాజకీయ నాయకులు చాలా మంది అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. ఐతే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండిస్తున్నాయి.

అధికార కాంగ్రెస్ మాత్రం సమర్ధించుకునే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడంతో ఈ వ్యవహారం పొలిటికల్‌గా టర్న్‌ తీసుకుంది. చట్టానికి సెలబ్రెటీ అయినా.. సామాన్యుడైనా ఒక్కటేనని రేవంత్‌ చెప్పుకొచ్చారు.. ఇంతవరకు బాగానే ఉంది. కానీ థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోతే ప్రశ్నించని వారు.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేస్తే ఎందుకు ప్రశ్నిస్తున్నారని సీఎం రేవంత్ కామెంట్ చేయడంపై పెద్ద చర్చ జరుగుతోంది.

సీఎం రేవంత్ వ్యాఖ్యల తర్వాత.. పుష్ప సక్సెస్‌మీట్‌లో జరిగిన ఓ ఘటన తెరపైకి వచ్చింది. సక్సెస్ మీట్ స్టేజ్‌పై అల్లు అర్జున్‌కు తెలంగాణ సీఎం పేరు గుర్తుకు రాలేదు. దీనిపై ఇటు సినీరంగంలో, అటు రాజకీయరంగంలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. పుష్ప సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరే గుర్తుకు లేదా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి.

సీఎం పేరును అల్లు అర్జున్ మరిచిపోయి, అవమానించారని టాక్ వినిపించింది. ఇదంతా మనసులో పెట్టుకునే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారన్న చర్చ మొదలైంది. సంధ్యా థియేటర్‌ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పది రోజుల తర్వాత అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంతో ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.

కాంగ్రెస్ నేతలు ఫీలవుతున్నారా?
మరోవైపు సినిమా ఇండస్ట్రీ పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వాన్నిగుర్తించడం లేదని పార్టీ నేతలు ఫీలవుతున్నారట. సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పుటి వరకు సినీ ప్రముఖులెవరు పెద్దగా ఆయన్నుకలవనే కలవలేదట. దీంతో సినిమా ఇండస్ట్రీపై రేవంత్ సర్కార్ ఆగ్రహంగా ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు నంది అవార్డ్స్ బదులుగా తెలంగాణ తరఫున గద్దర్ అవార్డ్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై తెలుగు ఇండస్ట్రీ పెద్దగా స్పందించడం లేదు. దీంతో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్‌ను అవకాశంగా తీసుకొని అల్లు అర్జున్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందనే చర్చ సైతం జరుగుతోంది.

హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా పోలీసులు, జైలు సిబ్బంది కావాలని తాత్సారం చేసి.. ఒక రోజు జైల్లో ఉండేలా చేయడం కూడా కుట్రలో భాగమేనని మరో వర్గం వాదిస్తోంది. మరోవైపు చిరంజీవి కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య ఉన్న విభేదాల నేపధ్యం కూడా అల్లు అర్జున్ అరెస్ట్‌కు ఓ కారణమనే మరో చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

ఈ ప్రచారాలకు అనుగుణంగా అల్లు అర్జున్‌ అరెస్ట్‌ కక్ష సాధింపు చర్యే అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు కేంద్ర మంత్రులు సైతం స్పందించారు. ఐతే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆ డైలాగులను కొట్టిపారేస్తున్నారు.. అల్లు అర్జున్‌పై కక్ష పెట్టుకోవాల్సిన అవసరం తమకేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఐతే చట్టం తన పని తాను చేసిందా? లేదంటే రాజకీయ ప్రమేయం ఉందా? ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులుంటాయో చూడాలి మరి.

కాంగ్రెస్‌లో మళ్లీ లొల్లి మొదలైందా? సీనియర్లు ఎందుకు గొంతెత్తుతున్నారు?