మాజీమంత్రి వర్సెస్ ఎమ్మెల్యే , కొల్లాపూర్ టీఆర్ఎస్‌లో కలహాలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఈసారి మాత్రం అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఇటు పార్టీ అధిష్టానానికి, అటు కేడర్‌కు తలనొప్పిగా మారింది. 2018 ముందస్తు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా వీచింది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క కొల్లాపూర్‌లోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మిగతా 13 స్థానాల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేసింది.
జూపల్లి, బీరం మధ్య గ్రూపు రాజకీయాలు:
కొల్లాపూర్ నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బరిలో నిలవగా కాంగ్రెస్ తరఫున బీరం హర్షవర్థన్ రెడ్డి పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో జూపల్లిపై హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత హర్షవర్థన్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో జూపల్లి, బీరం మధ్య గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పరిషత్ ఎన్నికలు మొదలుకొని.. మున్సిపల్ ఎన్నికల వరకు సాగిన వీరి గ్రూపు రాజకీయాలు పార్టీ అధిష్టానం వరకు వెళ్లాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 40-60 ఫార్ములాను అమలు చేసి పార్టీ అధిష్టానం వారిద్దరి మధ్యా సయోధ్య కుదిర్చింది. కానీ, మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎంపిక విషయంలో ఇద్దరు నేతల మధ్య మళ్లీ చిచ్చు రేగింది.
ఎక్స్ అఫీషియో ఓటుతో మున్సిపల్ పీఠం హర్షవర్ధన్ వర్గం కైవసం:
ఆ తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అదే ఫార్మూలా పాటించాలని పార్టీ అధిష్టానం సూచించినా జూపల్లి అంగీకరించలేదు. తమ వర్గానికి చెందిన అభ్యర్ధులకు బి-ఫాంలు ఇవ్వాలని పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జూపల్లి తమ వర్గం అభ్యర్ధులను 20 వార్డుల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున బరిలోకి దింపడంతో కొల్లాపూర్ నియోజవర్గ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఆ ఎన్నికల్లో రెండు గ్రూపులకు సరిసమానంగా సీట్లు రావడంతో ఎక్స్ అఫీషియో ఓటు సహాయంతో మున్సిపల్ పీఠాన్ని హర్షవర్ధన్‌రెడ్డి వర్గం కైవసం చేసుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య గ్రూపు రాజకీయాలు మళ్లీ ఎక్కువయ్యాయి.
https://10tv.in/congress-pathetic-condition-in-nalgonda-leaders-joining-trs/
కొల్లాపూర్ ఎంపీపీ సుధారాణి రాజీనామాతో మరోసారి చర్చ:
మొదటి నుంచి టీఆర్ఎస్ కోసం పని చేసిన కార్యకర్తలను కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో కొంత మంది నేతలు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఇప్పుడు కొల్లాపూర్ ఎంపీపీ సుధారాణి రాజీనామాతో ఆ నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశమైంది. అధికార పార్టీకి చెందిన సుధారాణి రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొని, అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
కానీ, ఎమ్మెల్యేపై అసంతృప్తితోనే కొంత మంది నేతలు పార్టీకి అంటీముట్టనట్టు ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూపల్లి, బీరం మధ్య గ్రూపు రాజకీయాలపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.