కాంగ్రెస్ 100 రోజులు నేటితో పూర్తి.. ఖమ్మంలో 3 రోజులకు ఒకసారి నీళ్లు ఎందుకు వస్తున్నాయి?: హరీశ్ రావు

Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.

కాంగ్రెస్ 100 రోజులు నేటితో పూర్తి.. ఖమ్మంలో 3 రోజులకు ఒకసారి నీళ్లు ఎందుకు వస్తున్నాయి?: హరీశ్ రావు

HARISH RAO

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు నేటితో పూర్తయ్యాయని, హామీలను నిలబెట్టుకోలేకపోయిందని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతు రుణమాఫీ చేయలేదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ పరువును పెంచే యత్నం చేశారని, రేవంత్ రెడ్డి ఇప్పుడు కరవును పెంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

వ్యవసాయాన్ని శిథిలావస్థకు చేరుస్తున్నారని విమర్శించారు. 100 రోజుల్లోనే తెలంగాణలో ఖాళీ బిందెల ప్రదర్శన మొదలైందని చెప్పారు. ఖమ్మంలో మూడు రోజులకు ఒకసారి నీళ్లు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. కర్ణాటకను ఒప్పించి తాగునీటిని తెచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదని అన్నారు.

అనేక విషయాల్లో సర్కారు యూటర్న్ తీసుకుంటోందని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఇదేనా పాలన అంటే అంటూ నిలదీశారు.

ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు పెన్షన్లని, మరి ఎక్కడ ఇచ్చారని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని చెప్పడం తమ బాధ్యతని అన్నారు. రైతులు, వృద్ధులు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ మోసం చేసిన హామీలపై ప్రజలు గుర్తించాలని అన్నారు. ఉద్యోగులను కూడా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ కి ఉందని తెలిపారు.

బీజేపీ ప్లాన్ అదుర్స్ కదూ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోపే ఏమేం సాధించిందో తెలుసా?