Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం.. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో అత్యధిక వర్షపాతం
హైదరాబాద్ నగరంలోని 100కు పైగా ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 70కి పైగా ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 20కి పైగా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

Hyderabad Rain (2)
Chandrayanagutta Highest Rainfall : హైదరాబాద్ లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కుండపోత వానలు పడుతున్నాయి. తాజాగా నగరంలో అర్ధరాత్రి తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ముసురు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారుగా వాన పడుతోంది. రోడ్లపై కాలనీలో నిలిచిన నీటిని జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, డీఆర్ టీంలు తొలగిస్తున్నాయి. భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ ఉండాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది.
హైదరాబాద్ నగరంలోని 100కు పైగా ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 70కి పైగా ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 20కి పైగా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అధికంగా చార్మినార్ జోన్ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అయ్యింది. హైదరాబాద్ లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అనసవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యలు అందించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది.
జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద నీర వచ్చి చేరుతోంది.దీంతో ఈ రెండు రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా గండిపేట రిజర్వాయర్ గేట్లను కూడా ఎత్తి వేశారు. తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము 7 గంటల వరకు రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 616 మిల్లి మీటర్ల భారీ వర్షపాతం నమోదు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 10కి పైగా ప్రాంతాల్లో 300 మిల్లీ మీటర్ల నుంచి 500 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. 50కి పైగా ప్రాంతాల్లో 200 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి
వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేసింది. భారీగా వర్షాలు కురుస్తున్న వేళ పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాన్ హోల్ దరిదాపుల్లోకి పిల్లలను వెళ్లనివ్వకూడదని పేర్కొంది. చెరువులు, మురికి కాలువులు, మురికి కుంటలు, ప్రవహిచే నీటి దరిదాపుల్లోకి పిల్లలను పంపవద్దని సూచించింది. పిల్లలను వర్షంలో ఆడుకోవడానికి, ఇంట్లో విద్యుత్ పరికరాల వద్దకు, బయట విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల స్తంభాల దగ్గరికి పిల్లలను పంపకూడదని వెల్లడించింది.
అత్యవసరమైతే తప్ప పెద్దలు కూడా ఇంటి నుంచి బయటికి రాకూడదని తెలిపింది. నీటి ప్రవాహంతో ఉన్న కాలువలు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయవద్దని పేర్కొంది. విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన లైన్లకు దూరంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, పాత గోడలకు పక్కన ఉండవద్దని హెచ్చరించింది. ఎక్కడ ఏముందో తెలిసివుంటుంది కాబట్టి ఎప్పుడు వెళ్లే దారిలోనే వెళ్లాలని పేర్కొంది.
వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు కల్వర్టు, అండర్ పాస్, చిన్న చిన్న బ్రిడ్జీల వద్ద నడిచి గానీ, వాహనాలతో గానీ నిర్లక్ష్యంగా దాటడానికి సాహసం చేయవద్దని హెచ్చరించింది. అత్యవసర సహాయ సహకారాల కోసం 100కు డయల్ చేయాలని తెలిపింది. పోలీసు మరియు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.