తెలంగాణపై వాన పడగ.. 23 జిల్లాలకు బిగ్ అలర్ట్.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు.. ఈ జిల్లాల వాళ్లు బీ కేర్ ఫుల్
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.

Heavy rains
Telangana Rain Alert: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు ప్రాతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే, రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ నగరంతోపాటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కన జిల్లాల్లో సోమవారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. కుత్బుల్లాపూర్ పరిధిలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే మూడునాలుగు రోజులు హైదరాబాద్‌సహా చుట్టుపక్కల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలకు సూచనలు ..
వర్షాలు, పిడుగుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ఈదురు గాలులు వీచే సమయంలో హోర్డింగ్‌లు, పాత భవనాలు, శిథిల గోడలు దగ్గర దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.