హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..

కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు చెప్పింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను సైతం హైకోర్టు కొట్టివేసింది.

హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..

Ganesh Idols Immersion : హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెప్ట్ (కోర్టు ధిక్కార) పిటిషన్ మెయింటైనబుల్ కాదన్న హైకోర్టు.. కోర్టు ధిక్కార పిటిషన్ ను తిరస్కరించింది. 2021 ఆదేశాలు యధావిధిగా కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది. వాటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తెలిపింది. నిమజ్జన సమయంలో ఇలాంటి పిటిషన్లు సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత ఆదేశాల్లో హైడ్రా లేదన్న న్యాయస్థానం.. ఇప్పుడు హైడ్రాను ఎలా చేరుస్తామని ప్రశ్నించింది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సైతం కోర్టు తిరస్కరించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహాల తయారీపై నిషేధం ఇవ్వలేము అని హైకోర్టు పేర్కొంది. పీవోపీ విగ్రహాలను తాత్కాలిక పాండ్లలో నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది.

అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషనర్ మామిడి వేణు మాధవ్ తన వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనం జరుగుతూనే ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం అవుతూనే ఉన్నాయన్నారు. అధికారులెవరూ కోర్టు ఆదేశాలను పాటించడం లేదన్నారు. ఈసారి జరిగే గణేశ్ నిమజ్జనానికైనా హుస్సేన్ సాగర్ లో జరగకుండా చూడాలని కోర్టును కోరారు. కాగా, గణేశ్ నిమజ్జనానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయని పిటిషనర్ మాధవ్ ను హైకోర్టు ప్రశ్నించింది. ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలంది.

వినాయక సాగర్‌లోనే నిమజ్జనాలు చేస్తాం- ఎమ్మెల్యే రాజాసింగ్
అటు ట్యాంక్ బండ్ పై జీహెచ్ఎంసీ పెట్టిన ఫ్లెక్సీలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహాలు వెయ్యకపోతే.. ఎక్కడ వెయ్యాలో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. విగ్రహాలు ఎక్కడ వేయాలని ప్రజలు ఆందోళనలు చెందుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వినాయక్ సాగర్ లో నిమజ్జనాలు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.

ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తే జీహెచ్ఎంసీకే లాభం- రాజాసింగ్
”హిందువులను ఇబ్బందులు పెట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. హైకోర్టులో జీహెచ్ఎంసీ తమ వాదనలు సమర్థవంతంగా వినిపించాలి. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేస్తే అందులో ఉన్న నీరు కలుషితం అవుతాయి అంటున్నారు. మరిప్పుడు ఆ నీళ్లు ఏమైనా కలుషితం కాకుండా శుభ్రంగా ఉన్నాయా..? కలుషిత నీటిలో విగ్రహాలు వేస్తే వచ్చే నష్టం ఏంటి..? విగ్రహాలు ట్యాంక్ బండ్ లో వెయ్యడం వలన జీహెచ్ఎంసీకే లాభాలు వస్తున్నాయి. టన్నుల కొద్దీ ఉన్న వినాయక విగ్రహాలకు ఉన్న ఐరన్ ఫ్రేమ్ అమ్ముకుంటుంది” అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

Also Read : సీఎం రేవంత్‌కి అత్యంత సన్నిహితుడైనా ఎందుకు పక్క పెట్టారు? హైదరాబాద్ సీపీ బదిలీకి అసలు కారణమేంటి..