సీఎం రేవంత్‌కి అత్యంత సన్నిహితుడైనా ఎందుకు పక్క పెట్టారు? హైదరాబాద్ సీపీ బదిలీకి అసలు కారణమేంటి..

వాస్తవానికి హైదరాబాద్‌ సీపీగా ఎవరున్నా కత్తిమీద సాము చేసినట్లే... మెట్రోపాలిటిన్‌ సిటీ కావడం, వీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండటంతో శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించాల్సి వుంటుంది.

సీఎం రేవంత్‌కి అత్యంత సన్నిహితుడైనా ఎందుకు పక్క పెట్టారు? హైదరాబాద్ సీపీ బదిలీకి అసలు కారణమేంటి..

Gossip Garage : ఆయన ఓ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌.. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే కొత్త ప్రభుత్వంలో కీలక పోస్టింగ్‌ దక్కించుకున్నారు. ఇక ఆ పోస్టుకు డిపార్ట్‌మెంట్‌లో ఎంతో క్రేజ్‌. అలాంటి పోస్టింగ్‌ ఏరికోరి వరిస్తే… ఎవరికైనా లక్కీయే.. కానీ, ఆ సిన్సియర్‌ ఆఫీసర్‌ మాత్రం ఏడాది కూడా ఆ పోస్టులో కొనసాగలేకపోయారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నా… కీలక పోస్టింగ్‌ నుంచి ఎందుకు బదిలీ అయ్యారు? అనేదే ఇప్పుడు చర్చ. ఇటు పోలీస్‌ వర్గాల్లోను.. అటు పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ హాట్‌టాపిక్‌గా మారిన హైదరాబాద్‌ సీపీ బదిలీకి అసలు కారణమేంటి?

అనూహ్యంగా ఒక్క ఏడాది కూడా పనిచేయకుండానే సీపీ కొత్తకోట బదిలీ..
హైదరాబాద్ కమిషనర్‌.. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో అత్యంత ఇంపార్టెంట్‌ పోస్ట్‌. రాష్ట్ర రాజధాని, మెట్రోపాలిటిన్‌ సిటీ అయిన హైదరాబాద్‌ సీపీగా పనిచేయాలని ఐపీఎస్‌ అయిన ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. కానీ, కొందరికే ఆ చాన్స్‌ దక్కుతుంది. అలాంటి వారిలో తాజాగా బదిలీ అయిన సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని ఏరికోరి ఎంపిక చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఎస్పీగా పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డికి అప్పటి నుంచే రేవంత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక నిజాయితీ, సమర్థత.. ఆయనకు అదనపు బలాలు. డిపార్ట్‌మెంట్‌లో పనితీరు విషయంలో ఎలాంటి విమర్శలు లేని శ్రీనివాస్‌రెడ్డిని సీపీగా చేయాలనే ప్రతిపాదన రాగానే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. అయితే అనూహ్యంగా ఒక్క ఏడాది కూడా పనిచేయకుండానే ప్రభుత్వం కొత్తకోటను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

బదిలీకి ముక్కుసూటి తనమే కారణం?
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ వింగ్‌లో ఎక్కడా పని చేయకపోయినా, ఎక్కువ కాలం లూప్‌ లైన్‌లో పనిచేసినా… డీజీ క్యాడర్‌ లేకపోయినా కేవలం సీఎం రేవంత్‌రెడ్డితో అనుబంధం కారణంగా శ్రీనివాస్‌రెడ్డికి సీపీగా నియమించినట్లు చెబుతున్నారు. కానీ, ఏడాది తిరగకుమందే ఆయనను ఆకస్మాత్తుగా బదిలీ చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి 2006లో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా పని చేశారు.. ఆ తర్వాత చాలా కాలం లూప్ లైన్‌ పోస్టులకే పరిమితమయ్యారు. సుదీర్ఘ కాలం గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లలో పని చేశారు.. అయితే సీఎంతో ఉన్న సంబంధాల వల్ల రేవంత్‌ సర్కార్‌ కొలువు దీరగానే సీపీ బాధ్యతలు అప్పగించినా నిలుపుకోలేకపోవడం వెనుక ఆయన ముక్కుసూటి తనమే కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కొత్తకోటపై తీవ్ర విమర్శలు..
వాస్తవానికి హైదరాబాద్‌ సీపీగా ఎవరున్నా కత్తిమీద సాము చేసినట్లే… మెట్రోపాలిటిన్‌ సిటీ కావడం, వీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండటంతో శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించాల్సి వుంటుంది. దీంతో ఎక్కువగా సిటీపై అవగాహన ఉన్నవారికే సీపీ బాధ్యతలు అప్పగిస్తారు. అయితే శ్రీనివాస్‌రెడ్డికి సిటీ పోలీస్‌ వింగ్‌లో పనిచేసిన అనుభవం లేకపోయినా, ప్రభుత్వం నమ్మకం ఉంచింది. కానీ, కొన్ని విషయాల్లో ఆయనపై వస్తున్న విమర్శలతో ఇప్పుడు పక్కన పెట్టిందంటున్నారు.

సిబ్బందితో దురుసు ప్రవర్తన, చిన్న నిర్లక్ష్యానికి పెద్ద పనిష్ మెంట్లు..
ముఖ్యంగా ఇటీవల ఆయన నిర్వహించిన సమావేశం ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. అదే సమయంలో కిందిస్థాయి సిబ్బందితో సఖ్యత లేకపోవడంతో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి. సిబ్బందితో దురుసు ప్రవర్తన… చిన్న నిర్లక్ష్యానికి పెద్ద పనిష్ మెంట్లు.. సరైన విచారణ లేకండా మెమోలు, సస్పెన్షన్లు అంటూ సిబ్బందిని హడలెత్తించిన సీపీ శ్రీనివాస్‌రెడ్డిపై ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పెద్దలకు తలనొప్పులు తెచ్చేలా వ్యవహరించడం కూడా ఆయనను పక్కన పెట్టడానికి ప్రధాన కారణమైందంటున్నారు.

Also Read : పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు తీర్పు.. కూనంనేని ఇలా, కడియం అలా..

లా అండ్‌ ఆర్డర్‌ విషయంలోనూ సీపీగా మైనస్‌ మార్కులు..
ఇలా సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి… అటు లా అండ్‌ ఆర్డర్‌ విషయంలోనూ పెద్దగా మార్కులు సంపాదించలేకపోయారంటున్నారు. వరుస హత్యలు నమోదవుతుండటం, డ్రగ్స్‌ వాడకం పెరిగిపోవడం, ప్రతిపక్షాల ఆందోళనలను ముందుగా పసిగట్టలేకపోవడం వంటివి ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైందంటున్నారు. అంతే కాకుండా ఏదైనా పనిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్ చేసినా సరిగ్గా స్పందించే వారు కారని అంటున్నారు. ఇలా ప్రభుత్వ పెద్దల మాటలను సైతం పెడచెవిన పెట్టిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. వాస్తవానికి సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ముక్కు సూటి మనిషి.. నిజాయితీ గల ఆఫీసర్.. కానీ, ఇవే ఆయన బదిలీకి పరోక్షంగా కారణమయ్యారంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ… మిగిలిన విషయాల్లో ఆయన సమన్వయం చేసుకోలేకపోవడం వల్లే బదిలీకి గురికావాల్సి వచ్చిందంటున్నారు.