Hydra Demolitions : హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు సీరియస్..
ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో చట్ట ప్రకారం వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.

Hydra Demolitions : హైడ్రా తీరుపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి 24 గంటల సమయమే ఎలా ఇస్తారని హైడ్రా న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు. ఇలా అయితే మరోసారి హైడ్రా కమిషనర్ ను కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని హెచ్చరించింది. హైదరాబాద్ ఖాజాగూడలోని బ్రాహ్మణికుంట ఎఫ్టీఎల్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
కూల్చివేతలపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించారు. నోటీసులు జారీ చేసి బాధితుల వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో చట్ట ప్రకారం వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.
అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝళిపించింది హైడ్రా. ఏడాది ముగింపు రోజున అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. బఫర్ జోన్ లో నిర్మించిన 20కి పైగా దుకాణాలను తొలగించారు. కాగా, కూల్చివేతలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖాజాగూడ చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లోని ఆక్రమణలపై హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు.
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లోని 9.07 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు..
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లోని 9.07 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించారు. ఖాజాగూడ భగీరధమ్మ చెరువు ఆక్రమణలపై స్థానికులు చేసిన ఫిర్యాదుపై స్పందించారు హైడ్రా అధికారులు. అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఇవాళ కూల్చివేతలకు దిగారు. మరోవైపు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.