‘నూతన సంవత్సర వేడుకలను ఎందుకు బ్యాన్ చేయలేదు’ : తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

‘నూతన సంవత్సర వేడుకలను ఎందుకు బ్యాన్ చేయలేదు’ : తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

Updated On : December 31, 2020 / 1:54 PM IST

High Court serious about New Year celebrations in Telangana : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇతర రాష్ట్రాల్లో నిషేధం విధించినా… తెలంగాణలో వేడుకలకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. బార్‌లను, పబ్‌లను విచ్చలవిడిగా… ఓపెన్ చేసి ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తున్న వేళ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. రాజస్థాన్, మహారాష్ట్రలో ఇప్పటికే వేడుకలను బ్యాన్ చేశారని హైకోర్టు గుర్తు చేసింది. మరోవైపు తెలంగాణ సర్కార్‌ ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు తెరుచుకోవచ్చని అనుమతిచ్చింది.

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై కరోనా ఆంక్షలు అమలు కానున్నాయి. ప్రజలు గుమికూడకుండా…బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరపుకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్, హైదరాబాద్‌ కమిషనరేట్ల‌ పరిధిలో ఆంక్షలు అమలుకానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటల ప్రారంభమైన ఆంక్షలు రేపు ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయి. సైబర్‌ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ, మైండ్‌ స్పేస్‌ ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు పోలీస్‌ శాఖ తెలిపింది. ఓఆర్‌ఆర్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

మరోవైపు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, నెక్టెస్‌ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం వరకు వాహనాల రాకపోకలను నిషేధించారు అధికారులు. నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్క్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వే వద్ద వాహనాలను దారి మళ్లించనున్నారు.