Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు.. హరీశ్ రావుసైతం పోలీసుల అదుపులో..

కొండాపూర్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో పోలీసులు ఆయన నివాసం వద్దకు వెళ్లి అరెస్టు చేశారు..

Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు.. హరీశ్ రావుసైతం పోలీసుల అదుపులో..

Harishrao Arrest

Updated On : December 5, 2024 / 11:30 AM IST

Harish Rao Arrest : కొండాపూర్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయాన్నే ఆయన నివాసం వద్దకు భారీగా పోలీసులను మోహరించారు. ఇదేక్రమంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకోవటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో గచ్చిబౌలి పోలీసులు హరీశ్ రావును అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. మరో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, కొత్త ప్రభాకర్, శంభీపూర్ రాజు, రాకేశ్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తరువాత ఎమ్మెల్యే కౌశిక్  రెడ్డి నివాసంలోకి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

Also Read: Gossip Garage : సీఎం రేవంత్ వాగ్ధాటిలో ఘాటు ఎందుకు తగ్గినట్లు? రీజన్ ఏంటి?

తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కౌశిక్ రెడ్డి వెళ్లారు. అయితే, కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో సీఐ వేరే పనిపై బయటకు వెళ్తున్నారు. సీఐను అడ్డుకొని తన ఫిర్యాదు తీసుకున్న తరువాతనే బయటకు వెళ్లాలని కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు. సీఐ చెప్పింది వినిపించుకోకుండా కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు సీఐ వాహనాన్ని అడ్డుకోవటంతో సీఐ స్టేషన్ లోకి తిరిగివచ్చి ఎమ్మెల్యే వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. ఈ ఘటన తరువాత విధులు అడ్డగించి బెదిరించారని ఇన్ స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిసహా 20 మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

గురువారం ఉదయం కౌశిక్ రెడ్డి నివాసంకు వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అంతకుముందు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకొని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు.