Left Parties: బీఆర్‌ఎస్‌తో బంధాన్ని కొనసాగించాలా, వద్దా.. తెలంగాణలో వామపక్షాల తర్జనభర్జన

కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో జట్టుకట్టాలా..? లేక.. విన్నింగ్ జోడీగా మునుగోడులో విక్టరీ కొట్టిన బీఆర్‌ఎస్‌తో బంధాన్ని కొనసాగించాలా తెలియక తర్జనభర్జన పడుతున్నారు కమ్యూనిస్టు నేతలు.

Left Parties: బీఆర్‌ఎస్‌తో బంధాన్ని కొనసాగించాలా, వద్దా.. తెలంగాణలో వామపక్షాల తర్జనభర్జన

Left Parties in Telangana

Left Parties Telangana: వచ్చే ఎన్నికల్లో సత్తాచాటాలని చూస్తున్న వామపక్షాలు.. ఏం చేయాలో తెలియని గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాయా? కేంద్రంలో కాంగ్రెస్ (Congress).. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS Party) తో దోస్తీ చేస్తున్న కమ్యూనిస్టులు (Communists) వచ్చేఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో తెలియక జంక్షన్‌లో నిలిచిపోయారా? వామపక్ష రాజకీయం ఎలా ఉండబోతోంది? తెరవెనుక రాజకీయం ఎలా ఉంది?

తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో చెలిమి చేస్తున్న వామపక్షాలకు ఇప్పుడు సరికొత్త సమస్య ఎదురవుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో కీలక భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు.. గత నవంబర్‌లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు బాసటగా నిలిచారు. ఆ నియోజకవర్గంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో బీజేపీకి ఖంగుతినిపించి సంచలన విజయం సాధించింది బీఆర్ఎస్. అప్పటివరకు బీఆర్‌ఎస్‌తో ఉప్పు-నిప్పుగా ఉన్న వామపక్షాలు.. మునుగోడు నుంచి స్నేహగీతం ఆలపిస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావించారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా సీపీఐ, సీపీఎం నాయకులకు సకల మర్యాదలు చేసిన బీఆర్‌ఎస్.. ఆ తర్వాత టచ్‌మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తోందట. ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదని టాక్ కూడా నడుస్తోంది.

ఇదే సమయంలో వామపక్ష పార్టీలకు సహజ మిత్రుడిగా కొనసాగుతున్న కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతపై కొత్త వేదిక నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పట్నా, బెంగళూరుల్లో సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ సమావేశాలకు వామపక్ష పార్టీల నేతలు హాజరుకాగా.. బీఆర్‌ఎస్‌కు కనీసం పిలుపు కూడా పంపలేదు కాంగ్రెస్ కూటమి. ఇదే ఇప్పుడు రాష్ట్రంలోని కమ్యూనిస్టులకు కన్ఫీజ్ చేసేస్తోంది. కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో జట్టుకట్టాలా..? లేక.. విన్నింగ్ జోడీగా మునుగోడులో విక్టరీ కొట్టిన బీఆర్‌ఎస్‌తో బంధాన్ని కొనసాగించాలా తెలియక తర్జనభర్జన పడుతున్నారు కమ్యూనిస్టు నేతలు.

Also Read: ఆశావహులు, అసమ్మతి నేతలు జారిపోకుండా కేసీఆర్ కొత్త వ్యూహం.. జంప్ జిలానీలకు చెక్!

వాస్తవానికి వామపక్ష పార్టీలు రెండు రకాల విధానాలతో రాజకీయం చేస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక ఎజెండా ప్రధానంగా చేసుకుని కేంద్రంలో కాంగ్రెస్‌ కూటమితో జట్టుకట్టడం కమ్యూనిస్టు నేతలకు అనివార్యంగా మారింది. అదే సమయంలో రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా లేనిచోట ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే స్వేచ్ఛ స్థానిక రాష్ట్ర కమిటీలకు అప్పగించాయి సీపీఎం, సీపీఐ జాతీయ నాయకత్వాలు.

Also Read: జగ్గారెడ్డి, రఘునందన్‌రావు మౌనం.. అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం

అయితే తెలంగాణలో గత నవంబర్‌లో ఎన్నికలు జరిగినప్పటి పరిస్థితులకి.. ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. అప్పట్లో కనీసం పోటీ ఇవ్వలేనట్లు కనిపించిన కాంగ్రెస్.. మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల తర్వాత అనూహ్యంగా తెలంగాణలోనూ పుంజుకుంది. చేరికలతో రాష్ట్ర రాజకీయాల్లో హడావిడి చేస్తోంది. ఈ పరిస్థితులతో సీపీఐ, సీపీఎం పార్టీల్లో విస్తృత చర్చ జరుగుతోందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌తో వెళ్దామని కొందరు.. కాంగ్రెస్‌తో కంటిన్యూ అవుదామని మరికొందరు ప్రతిపాదిస్తున్నారట.. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు జంక్షన్‌లో నిలిచిపోయారని అంటున్నారు.