Gelli Srinivas Yadav : నన్ను గెలిపిస్తే..పని మనిషిలా సేవ చేస్తాను : గెల్లు శ్రీనివాస్

హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Gelli Srinivas Yadav : నన్ను గెలిపిస్తే..పని మనిషిలా సేవ చేస్తాను : గెల్లు శ్రీనివాస్

Huzurabad Trs Mla Candidate Gellu Srinivas Yadav Interesting Comments

Updated On : August 11, 2021 / 5:51 PM IST

Gellu Srinivas interesting comments : హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించుకుని రమ్మని సీఎం కేసీఆర్…హరీష్ రావుకి అప్పచెప్పారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తాను అత్యంత పేద కుటుంబంలో పుట్టానని పేర్కొన్నారు. వీణవంక మండలం హిమ్మయత్ నగరం బిడ్డనని తెలిపారు. ఎన్నో ఉద్యమాలు చేసిన బిడ్డగా మీ ముందుకు వచ్చానని పేర్కొన్నారు. అనేక ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి గెలుపు కోసం పని చేసినట్లు గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటలో ఉంటానని…నోట్లో నాలుకగా ఉంటానని చెప్పారు.

తనకు రెండు గుంటల భూమి మాత్రమే ఉందని… ఏమీ ఆస్తులు లేవన్నారు. తనకు ఏమీ కోరికలు లేవన్నారు. తనను గెలిపిస్తే..పని మనిషిలా సేవ చేస్తానని చెప్పారు. అవకాశం కల్పించిన కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. పార్టీ అభ్యర్థిగా ప్రకటించగానే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల నుంచి శ్రీనివాస్ కు అభినందనలు వెల్లువెత్తాయి.

కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయ్యాక ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజీనామా అనంతరం ఈటల బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం విస్తృతంగా టీఆర్ఎస్ నాయకత్వం అన్వేషించే క్రమంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, స్వర్గం రవి, వీరేశం, వకుళాభరణం కృష్ణమోహన్‌తో పాటు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి పేరు కూడా వినిపించింది. అయితే సీఎం కేసీఆర్‌.. కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించారు.

మిగిలినవారిలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ వైపే సీఎం కేసీఆర్ మొగ్గుచూపారు. బీసీ నేతగా ఈటల రాజేందర్‌ ప్రజల్లోకి వెళ్తుండడంతో ఆయనకు చెక్‌ పెట్టేందుకు బీసీ నేత గెల్లు శ్రీనివాస్ ను ప్రయోగించాలని టీఆర్‌ఎస్‌ చూస్తోంది. ఉద్యమం సమయం నుంచే టీఆర్‌ఎస్‌వీలో క్రియాశీలకంగా వ్యవహరించిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ది హుజూరాబాద్‌ నియోజకవర్గం కావడం ఒక ప్లస్‌ పాయింట్ అయితే ఉన్నత విద్యావంతుడు కావడంతో మరో అర్హతగా మారింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో విద్యార్థి దశ నుంచే బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్‌ఎస్‌వి తరపున ఉద్యమానికి నాయకత్వం వహించారు.