CP Sandeep Sandilya : ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యే వరకు పాటించాల్సిన నిబంధనలు, అతిక్రమిస్తే కఠిన చర్యలు : సీపీ సందీప్ శాండిల్య వార్నింగ్
రేపు ఓట్ల కౌంటింగ్ జరుగనుంది.దీంతో హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్యకీలక ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు నిబంధనలు పాటించి తీరాలని ఆదేశించారు.

CP Sandeep Sandilya
HYD CP Sandeep Sandilya : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పూర్తి అయ్యింది.ఇక కౌంటింగ్ పైనే పార్టీల దృష్టి అంతా ఉంది. నేతలంతా ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కంపుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పూర్తి భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈక్రమంలో కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమలులో ఉండనున్నాయి.
దీనికి సంబంధించి హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్య ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. దీంట్లో భాగంగా జనాలు గుంపులు గుంపులుగా ఒకేచోట ఉండకూడదని..ఐదుగురికి మించి ఒకచోట ఉండకూడదని ఆదేశించారు. మరీ ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కిలోమీటరు దూరంలో గుంపులుగా జనాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
అలాగే ఏ పార్టీకి సంబంధించిన జెండాలు పట్టుకుని ఉండకూడదని..అలాగే కర్రలు, పేలుడు దార్ధాలతో ఎవ్వరు కనిపించినా..కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైకుల్లో ప్రచారాలు కూడా చేయకూడదని ఆదేశించారు.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని..కాబట్టి నగరంలో డిసెంబర్ 3 ఉదయం నుంచి 4తేదీ ఉదయం 6 గంటల వరకు అంటే 24 గంటలపాటు మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులతో పాటు క్లబ్బులు, రెస్టారెంట్లు, స్టార్స్ హోటల్స్ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.