వామ్మో.. కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు.. పాడైన సరుకులతో వంటలు.. హైదరాబాద్‌లోని హోటల్స్‌లో దారుణాలు..

పలు హోటళ్లలోని కిచెన్ లలో బొద్దింకలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.

వామ్మో.. కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు.. పాడైన సరుకులతో వంటలు.. హైదరాబాద్‌లోని హోటల్స్‌లో దారుణాలు..

Updated On : November 7, 2024 / 6:17 PM IST

Hyderabad Hotels : హైదరాబాద్ లో హోటళ్ల బాగోతం బయటపడుతోంది. హోటల్స్ లోని కిచెన్లు చూస్తే మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉండు.. అనే సామెత గుర్తుకొస్తోంది. డైనింగ్ హాల్ చూస్తే వావ్ అనుకునే పరిస్థితి ఉండగా.. కిచెన్ లోపల చూస్తే వాంతి వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భాగ్య నగరంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉండగా.. తాజాగా మలక్ పేట్ నియోజకవర్గంలోని సంతోష్ నగర్ లోని పలు హోటల్స్ లో తనిఖీలు చేశారు.

శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, స్వాతి, స్వాగత్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా.. అక్కడి పరిస్థితి చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు కంగుతిన్నారు. కనీస నిబంధనలు పాటించడం లేదని తేల్చారు. పలు హోటళ్లలోని కిచెన్ లలో బొద్దింకలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. అంతే కాకుండా ఆ హోటళ్లలోని సరుకులు ఎక్స్ పైరీ అయ్యాయి. కుళ్లిన కూరగాయలతో వంటలు చేస్తున్నారు.

స్టోర్ రూమ్ లో ఫంగస్ వచ్చిన అల్లంను వంటకాల్లో వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయా హోటళ్ల నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించని హోటళ్లను సీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

నగరంలోని అనేక హోటళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నిర్వహణ సరిగా లేదు. ఎక్స్ పైరీ అయిన సరుకులనే వినియోగిస్తున్నారు. కిచెన్ ఏరియా, వాష్ రూమ్ ఏరియాలు చాలా భయానకంగా ఉన్నాయి. ఏమాత్రం పరిశుభ్రత లేదు. అవన్నీ కూడా ఇన్ ఫెక్టెడ్ పరిసరాలుగా మారిపోయాయి. ఎలుకలు, బొద్దింకలు, ఈగలు రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, ఆ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, స్టేట్ ఫుడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు నగరంలోని వివిధ హోటల్స్ లో తనిఖీలు చేస్తున్నారు.

వీరి తనిఖీల్లో ఈ లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఓనర్లు లేకుండా పని వాళ్లలో నిర్వహించే హోటల్స్ లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. తినే ఆహార పదార్దాలు, ఉపయోగించే కూరగాయలు, సరుకులు ఎలా పడితే అలా పడేశారు. అవన్నీ కూడా బూజు పట్టిన స్థితిలో ఉన్నాయి. వాటినే తీసుకుని ఆహార పదార్దాల తయారీకి వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. హోటల్స్ కిచెన్ లలో వెలుగుచూసిన దారుణాలు.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇలాంటి హోటల్స్ కి వెళ్లి తింటే మా పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు. ఇలాంటి చోట్ల తింటే రోగాలు రావడం ఖాయం అంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి హోటళ్ల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.

 

Also Read : మేము మంత్రులం కాదా, మాకు వాడే అర్హత లేదా? హెలికాప్టర్ కోసం లొల్లి..