కాలిపై బలమైన గాయం, తీవ్ర భయాందోళన.. ఫార్మసీ విద్యార్థిని కేసు

hyderabad pharmacy student case: రాష్ట్రంలో సంచలనం రేపిన బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఆటోడ్రైవర్ తో పాటు పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మెరుగైన చికిత్స కోసం బాధితురాలని గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతి కాలిపై బలమైన గాయం ఉందని, ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. యువతి తీవ్ర భయాందోళనలో ఉందని డాక్టర్లు చెప్పారు. అసలు ఏం జరిగిందో చెప్పలేకపోతోందన్నారు. యువతికి హైబీపీ ఉందన్న డాక్టర్లు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడానే ఉందన్నారు.
ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. వీధికో కీచకుడు, సందుకో దుశ్శాసనుడు పుడుతూనే ఉన్నాడు. హైదరాబాద్ నగర శివార్లలో తాజాగా జరిగిన ఓ సంఘటన భాగ్యనగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఫార్మసీ విద్యార్థినిపై ఓ ఆటో డ్రైవర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాదు యువతిని వివస్త్రను చేసి నడి రోడ్డుపై వదిలేసి పారిపోయాడు.
ఘట్ కేసర్ సమీపంలోని ఓ కాలేజీలో ఫార్మసీ చదవుతున్న విద్యార్థిని.. కాలేజీ ముగిసిన తర్వాత ఆటోలో ఇంటికి బయల్దేరింది. ఆ విద్యార్థినిపై కన్నేసిన ఆటో డ్రైవర్.. కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు స్నేహితులను పిలిచి.. బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లాడు. ఆ ముగ్గురు.. యువతి దుస్తులు చించేసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత నగ్నంగానే రోడ్డుపై వదిలి పరారయ్యారు.
ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న(ఫిబ్రవరి 10,2021) సాయంత్రం 6.30 గంటల సమయంలో విద్యార్థిని నాగారం నుంచి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ఆర్ నగర్ బస్టాప్ వెళ్లేందుకు సెవన్ సీటర్ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు సీనియర్, మరో ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. కొద్దిదూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు.
ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్లగానే ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. ఇంతలో విద్యార్థిని దిగాల్సిన ఆర్ఎల్ఆర్ నగర్ స్టేజీ వచ్చినా ఆటోను ఆపలేదు. ఆమె అరిచేలోగానే ఆటోలో అప్పటికే ఎక్కి కూర్చున్న ఇద్దరు యువకులు ఆమె నోరు నొక్కి పట్టుకున్నారు. ఆటో ఘట్‌కేసర్ మండలంలోని యంనంపేట రాగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వ్యాన్‌లోకి ఆమెను ఎక్కించారు. యువతి చాకచక్యంగా తన దగ్గరున్న ఫోన్‌తో కిడ్నాప్‌కు గురైనట్టు తల్లికి సమాచారం అందించింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్సల్ ఆధారంగా లొకేషన్ చేరుకున్నారు. బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బాధితురాలి ఫోన్ నంబర్ లొకేషన్‌ను ట్రేస్ చేయడంతో.. అది నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం దగ్గర చూపింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే నిందితులు పారిపోయారు.
కాగా, విద్యార్థిని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విషయం తెలుసుకున్న వ్యాన్, ఆటో డ్రైవర్లతోపాటు ఆటోలో ఎక్కిన ఇద్దరు యువకులు యువతిని వ్యాన్ నుంచి దించి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి కర్రలతో దాడి చేశారు. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఆమెను వదిలి దుండగులు పరారయ్యారు. గాయపడిన యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.