Hyderabad: ఇన్‌స్టాలో పరిచయమై.. 50 మంది బాలురు, బాలికల “మత్తు” పార్టీ.. ఫాంహౌస్‌లో పట్టుకున్న పోలీసులు
ఈ కేసులో ఆరుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై మైనర్ల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Representative image
Hyderabad: వాళ్లంతా ఇంటర్ చదువుతున్నారు. వారి వయసు 15-17 మాత్రమే. ఈ వయసులో మత్తుకు, జల్సాలకు అలవాటు పడ్డారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉండే ఈ బాలురు, బాలికలు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై పార్టీ చేసుకున్నారు.
పార్టీ అంటే కేక్ కట్ చేసుకుని, కూల్‌డ్రింక్స్ తాగి వెళ్లిపోయే మామూలు పార్టీ కాదు. ఆ మైనర్లు రాత్రి పూట ఫాంహౌస్‌కి వెళ్లి మత్తు పార్టీ చేసుకున్నారు. మొత్తం 50 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. వారిలో 14 మంది బాలికలు ఉన్నారు.
పక్కా సమాచారంతో పోలీసులు ఆ ఫాంహౌస్‌పై దాడులు చేసి డ్రగ్స్, మద్యాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో. రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసుల తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు బయటకు వచ్చాయి.
Also Read: భారీగా పెరిగిన బంగారం ధర.. దీపావళికి ముందే ఆల్ టైమ్ రికార్డులు బద్దలు.. ఈ రోజు రేటు
హైదరాబాద్‌కు చెందిన ఒక డీజేకి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్ హౌస్.9ఎంఎం పేరుతో అకౌంట్ ఉంది. ఫాంహౌస్‌లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్టు ఇటీవల యాడ్స్ ఇచ్చాడు. లెక్కలేనంత మజా పొందవచ్చని విద్యార్థులను ఆకర్షించాడు. పార్టీలో పాల్గొనేందుకు పాస్‌లు అమ్మాడు.
సింగిల్‌గా వస్తే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800కి టికెట్లు ఇచ్చాడు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి మైనర్లు 50 మంది పార్టీకి వెళ్లారు. ఓక్స్ ఫాంహౌస్‌లో మత్తులో మునిగితేలారు. పోలీసులు వారిని పట్టుకుని డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్టు తేలింది.
ఈ కేసులో ఆరుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై మైనర్ల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.