Hydra Demolitions : మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా.. మల్కాజ్‌గిరి సర్కిల్‌లో ఆక్రమణలు కూల్చివేత..

చెరువు ఆక్రమణలపై ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, దాంతో తాము హైడ్రాకు ఫిర్యాదు చేశామని స్థానికులు చెబుతున్నారు.

Hydra Demolitions : మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా.. మల్కాజ్‌గిరి సర్కిల్‌లో ఆక్రమణలు కూల్చివేత..

Updated On : December 6, 2024 / 8:52 PM IST

Hydra Demolitions : హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. మల్కాజ్ గిరి సర్కిల్ లోని నాగిరెడ్డి చెరువు ఆక్రమణలపై కొరడా ఝళిపించింది. యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్ట చెరువు ఆక్రమణలకు గురైందంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులతో హైడ్రా రంగంలోకి దిగింది. సర్వే నెంబర్ 14, 32లో చెరువు స్థలం కబ్జాకు గురైందని గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. అలుగు స్థలంలో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను కూల్చేశారు. అయితే, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని బాధితులు వాపోయారు.

హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలపై వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా అధికారులు కొనసాగిస్తున్నారు. తాజాగా జవహర్ నగర్ పరిధిలోని మల్కాజ్ గిరి సర్కిల్ పరిధిలో నాగిరెడ్డి చెరువుకు సంబంధించి ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా ఝళిపించారు. అక్రమ కట్టడాలను కూల్చేశారు. ప్రధానంగా సర్వే నెంబర్ 14, 32లలో చెరువు స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సర్వే నిర్వహించిన అనంతరం కూల్చివేతలు ప్రారంభించారు.

చెరువు ఆక్రమణలపై ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, దాంతో తాము హైడ్రాకు ఫిర్యాదు చేశామని స్థానికులు చెబుతున్నారు. చెరువు పరిరక్షణ కోసం స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు ఒక టీమ్ గా ఏర్పడి పని చేస్తున్నారు. చాలా కాలంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. తాజాగా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : హైదరాబాద్ మలక్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బైకులు