కరోనా కేసుల్లో చైనాను దాటిపోతున్న భారత్

భారత్ లో కోవిడ్-19 కేసుల సంఖ్య ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. మొన్నటి వరకు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రతాపం చూపిన ప్రాణాంతక కరోనా.. భారత్‌లోనూ అదే వరవడిని కొనసాగిస్తోంది. భారత్‌లో కరోనా కేసులు వైరస్ పురుడుపోసుకున్న చైనాను మించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ చైనాలోనే పుట్టడంతో ప్రారంభంలో కరోనా కేసులు తీవ్రత ఎక్కువగా ఉండేది. డిసెంబర్ నుంచి మార్చి వరకు చైనా సహా పలు అమెరికా,ఇటలీ,ఫ్రాన్స్ వంటి పలు దేశాల్లో కరోనా కేసులు వేలల్లో పెరిగాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
మనదేశంలో మాత్రం ఏప్రిల్, మే నెల్లో కేసులు వేలల్లో పెరిగాయి. రెండు మూడు రోజుల వ్యవధిలోనే పది వేల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో గడిచిన నెలరోజుల్లో ప్రతి రోజూ కనీసం మూడువేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాటికి కరోనా కేసుల్లో భారత్ చైనాను అధిగమించనుంది. చైనాలో కరోనా కేసులు 83 వేలకు చేరువలో ఉంటే… మన దేశంలో కూడా అదే స్థాయి కేసులు నమోదవుతున్నాయి.
చైనాలో ఇప్పటి వరకు 82,933 కరోనా కేసులు నమోదు కాగా 4,633 మంది మరణించారు. 78,209మంది కోలుకున్నారని, జనవరి నుంచి మొదటిసారిగా చైనాలో కరోనా యాక్టివ్ కేసులు 100లోపే ఉన్నాయని ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ శుక్రవారం ప్రకటించింది. చైనాలో ప్రస్తుతం 91 యాక్టివ్ కరోనా కేసులే ఉన్నాయని,ఇందులో 11మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిపింది.
అయితే ఇప్పటికే భారత్ లో కేసుల సంఖ్య 82 వేలు దాటింది. ఒకటి రెండు రోజుల్లో చైనాను క్రాస్ చేసేస్తాం. అయితే చైనాతో పోల్చుకుంటే భారత్ లో కాస్తా మరణాల రేటు తక్కువగా ఉంది. రికవరీ రేటు కూడా తక్కువగానే ఉంది. భారత్ లో ఇప్పటివరకు 2,649 మంది కరోనాతో చనిపోయారు. 27,920మంది కోలుకున్నారు.
అయితే కరోనా కేసులను బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం దాస్తోందంటూ అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కరోనాకు జన్మస్థలమైన వుహాన్‌లోనూ పెద్ద ఎత్తున మరణాలు నమోదు అయినప్పటికీ చైనా ప్రభుత్వం వాటిని బయటకు రానీయకుండా దాచిపెడుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే చైనాలో కరోనా కేసులు లక్షకు పైనే నమోదై ఉంటాయని వార్తలు కూడా వినిపించాయి. అయితే వీటన్నింటనీ డ్రాగాన్ దేశం ఖండించింది. వైరస్ బారిపడ్డ మొత్తం 80వేలకు పైగా బాధితులు పూర్తిగా కోలుకున్నారని చైనా చెబుతోంది.
ప్రపంచానికి ఈ దుస్థితి రావడానికి కారణం చైనాయేనని బహిరంగానే అమెరికా సహా పలు దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కోవిడ్ -19విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ను చైనా బెదిరించినట్టు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(CIA)తెలిపింది.వైరస్ విషయమై ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా…WHOని నిలువరించేందుకు చైనా ప్రయత్నించినట్టు తన లేటెస్ట్ రిపోర్ట్ లో సీఐఏ తెలిపింది. CIA తన లేటెస్ట్ రిపోర్ట్ లో…. కరోనా వైరస్ విషయమై ప్రపంచ వ్యాప్త హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తే… తమ సహకారాన్ని నిలిపేస్తామని WHOని జనవరిలో డ్రాగన్ దేశం బెదిరించినట్టు వివరించింది. అంతేకాదు, డబ్ల్యూహెచ్ఓ మౌనంగా చోద్యం చూడటంతో ఇతర దేశాల నుంచి చైనా భారీగా ఔషధాలు, వైద్య పరికరాలను దిగుమతిచేసుకుందని తెలిపింది.
WHOని చైనా బెదిరించినట్టు ఆరోపిస్తూ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక వెల్లడించడం ఇది రెండోది. తొలిసారి జర్మనీ నిఘా సంస్థ డెర్ స్పైగల్ కూడా తన నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌పై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. కరోనా వైరస్ ను అంటువ్యాధిగా ప్రకటించడానికి తొమ్మిది రోజుల ముందు జనవరి 21న జిన్‌పింగ్ వ్యక్తిగతంగా ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిపిన విషయం తెలిసిందే.
ఇక, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మూడు లక్షలు దాటి పోయింది. అన్ని దేశాల్లో కలిపి 45 లక్షల 25వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 17 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధికంగా అమెరికాలో 86 వేల 9 వందల మంది కరోనాతో చనిపోయారు. నిన్న ఒక్క రోజే అమెరికాలో 1754 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాత యూకేలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 33 వేల ఆరు వందల మంది కరోనాతో చనిపోయారు.
Read Here >> భారత్‌లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు, 3,967 కేసులు నమోదు