iPhone Maker: హైదరాబాద్‌లో ఫాక్స్‌కాన్‌ భూమిపూజ.. ఏమిటీ టెక్నాలజీ గ్రూప్? చైనా ఎందుకు ఆందోళన చెందుతోంది?

Telangana: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల హబ్‌గా తెలంగాణ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలే కాకుండా రాష్ట్ర కీర్తి, బ్రాండ్ పేరు మరింత పెరుగుతుంది.

iPhone Maker: హైదరాబాద్‌లో ఫాక్స్‌కాన్‌ భూమిపూజ.. ఏమిటీ టెక్నాలజీ గ్రూప్? చైనా ఎందుకు ఆందోళన చెందుతోంది?

iPhone Maker Foxconn In Telangana

Updated On : May 14, 2023 / 5:42 PM IST

Foxconn: హైదరాబాద్ (Hyderabad) శివారులోని కొంగరకలాన్‌ గ్రామంలో దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్ భాగస్వామి ఫాక్స్‌కాన్ కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం సోమవారం భూమి పూజ చేయనుంది. దీంతో అందరి దృష్టీ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ (iPhone Maker Foxconn) కొత్త ప్లాంట్ పైనే పడింది. ఆ సంస్థ తైవాన్‌ కు చెందింది.

తెలంగాణ (Telangana) ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఫాక్స్‌కాన్‌ సంస్థ ప్రతి నిధులు భూమిపూజ చేయనున్నారు. అనంతరం జరిగే సభకు దాదాపు 10 వేల మంది హాజరుకానున్నారు. ఫాక్స్‌కాన్ సంస్థకు రాష్ట్ర సర్కారు 196 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా 35,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి.

స్థానిక ఉత్పత్తుల తయారీ వేగవంతం

ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్ లో దాదాపు రూ.5.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా స్థానిక ఉత్పత్తుల తయారీని వేగవంతం చేయనుంది. ఓ వైపు, అమెరికా-చైనా మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. తైవాన్ చుట్టూ చైనా యుద్ధ విమానాలు పదే పదే చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో తమ ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి కూడా తరలించాలని ఆపిల్ సంస్థ భావిస్తోంది. ఇదే సమయంలో ఆపిల్ భాగస్వామి ఫాక్స్‌కాన్ కొత్త ప్లాంట్ తెలంగాణలో ఏర్పాటు చేయడానికి వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. ఫాక్స్‌కాన్‌ చాలా కాలంగా భారత్ లో ఐఫోన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇన్నాళ్లకు ఆ ప్రయత్నాల్లో ముందడుగు పడింది. అసెంబ్లింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అంతేగాక, ఎలక్ట్రానిక్ వాహనాల పార్టులను కూడా ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

చైనాకు ఎందుకు ఆందోళన?
ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్ లో భారీగా పెట్టుబడులు పెడుతుండడంతో చైనా ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం “కన్జూమర్ ఎలక్ట్రానిక్స్”లో చైనా ప్రపంచంలోనే అదిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్, యాపిల్ సంస్థ భారత్ కేంద్రంగా పనులు ప్రారంభిస్తే.. “కన్జూమర్ ఎలక్ట్రానిక్స్”లో ప్రపంచంలోనే అదిపెద్ద ఉత్పత్తిదారు హోదాను చైనా కోల్పోయే ప్రమాదం ఉంది.

ఆపిల్ మాత్రమే కాదు.. ఇతర అమెరికా బ్రాండ్లు కూడా చైనాను విడిచే అవకాశం ఉంది. ఆయా సంస్థలు నేరుగా భారత్, వియత్నాం వంటి దేశాలకు తరలిపోతాయి. దీంతో చైనాకు పెద్ద దెబ్బే పడుతుంది. ఈ నేపథ్యంలోనే చైనా ఆందోళన చెందుతోంది. చైనా ప్రజలూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతారు. జెంగ్జౌలోని ఐఫోన్ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది పని చేస్తున్నారు.

భారత్ లోని తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌. ఆ సంస్థ చైర్మన్‌ యంగ్‌ లియు కొన్ని వారాల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

తెలంగాణ ఇమేజ్ మరింత..

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల హబ్‌గా తెలంగాణ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలే కాకుండా రాష్ట్ర కీర్తి, బ్రాండ్ పేరు మరింత పెరుగుతుంది. ఫాక్స్‌కాన్ కు హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో లిమిటెడ్ గానూ పేరు ఉంది. ఈ మల్టీనేషన్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఆసియాలోనే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోనూ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

దీన్ని టెర్రీ గౌ 1974లో స్థాపించారు. క్రమంగా అది ఎదుగుతూ.. అమెరికాలోనే కాకుండా కెనడా, చైనా, జపాన్ వంటి దేశాల్లోని దిగ్గజ సంస్థలకు ఉత్పత్తుల తయారీ భాగస్వామిగా నిలిచింది. ఈ సంస్థ ఐప్యాడ్, ఐఫోన్లు, కిండ్ల్ మాత్రమే కాకుండా నోకియా, సిస్కో, సోనీ డివైస్ లు, గూగుల్ పిక్సెల్ ఫోన్లు, మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ వంటివి కూడా తయారు చేస్తుంది. కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులూ తయారవుతాయి.

Teacher-Student Love Story : అతనికి 22.. ఆమెకు 48.. క్లాస్ టీచర్‌ని పెళ్లాడిన స్టూడెంట్