బురుజుకు రూ.55 లక్షలు : మధ్య మానేరు : నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు

రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండలములోని మధ్య మానేరు ముంపు గ్రామాల పరిహారం చెల్లింపుల్లో …అక్రమస్వాహాల పర్వం కొనసాగుతూనే ఉంది. అక్రమార్కుల చేతివాటానికి అవినీతి అధికారుల అండదండలు కూడా తోడవడంతో వారు ఆడిందే ఆటగా, పాడిండే పాటగా తయారైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మధ్యమానేరు ప్రాజెక్ట్ క్రింద 12 గ్రామాలు ముంపునకు గురి అయ్యాయి. ఆయా గ్రామాల్లో ఇప్పటికే పరిహారం చెల్లింపుల్లో ఎన్నో అవకవతలు, అవినీతి అక్రమాలు వెలుగు చూసిన సందర్బాలు అనేకం ఉన్నాయి. పాత ఇళ్లను కొత్త ఇల్లులుగా చూపించి వాటి విలువలను పెంచడం, లేని ఇంటిని సృష్టించి.. ఆస్తి విలువను పదింతలు పెంచి పరిహారాలు అందించిన సందర్భాలు అనేకం జరిగాయి.
గతంలో అక్రమాలు జరిగిన విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో విచారణ కూడా జరిపింది. అయినా తంగళ్ళపల్లి మండలంలోని చింతల్ టానా గ్రామములోని పాత కాలము నాటి బురుజుకు గాను ఓ ప్రైవేట్ వ్యక్తికి 55 లక్షల రూపాయలు అధికారులు చెల్లించారు. గ్రామపంచాయతీ రికార్డులలో 1-97 నంబరుతో బురుజు గ్రామపంచాయతీ ఆస్తిగా నమోదు అయి ఉంది. ప్రభుత్వం భూ సేకరణ చట్టం క్రింద 2009 ఫిబ్రవరి 26 రోజున ఇచ్చిన నోటిఫికేషనులో కూడా బురుజును గ్రామపంచాయతీ ఆస్తిగానే చూపించారు. కానీ పరిహారం చెల్లింపుల్లో మాత్రం అదే గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తికి అందించడ ఇప్పుడు స్థానికంగా విమర్శలకు దారితీస్తోంది.
గ్రామస్తులు మాత్రం తమ ముత్తాతల కాలము నుండి బురుజు వద్ద దసరా పండుగను ఘనంగా జరుపుకోవడం తాము చూశామని… ఆ బురుజు ప్రభుత్వ రికార్డులలో కూడా గ్రామ పంచాయతీ ఆస్తిగానే చూపించారని, కానీ ఉన్నట్టుండి ఎవరికి తెలియకుండా ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పనంగా అంతాపెద్ద మొత్తాన్నిఅధికారులు ఎలా చెల్లించారని ప్రశ్నిస్తున్నారు.