గేదెకు తెల్లటి దూడ పుట్టిందేంటయ్యో..!! ఇదేందో వింతగా ఉందే..

buffalo gave birth to a white calf : తెల్లవాడు కడుపునా ఎర్రావు పుట్టదా? కర్రావు కడుపునా తెల్లావు పుట్టదా..అనే పాట విన్నాం. అంటే తెల్లటి ఆవులకు నల్లటి దూడలు పుడతాయి. కానీ నల్లగా ఉండే గేదెలకు తెల్లటి దూడ పుట్టటం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలా పుడితే కాస్త వింతగా చూస్తాం. అలా తెలంగాణాలోని జగిత్యాల జిల్లాలో ఓ రైతు గేదెకు తెల్లటి దూడ పుట్టింది. ఆ దూడ ఆవుదూడా అన్నంత తెల్లగా ఉంటంతో దాన్ని చుట్టుపక్కలవారంతా ఆసక్తిగా చూస్తున్నారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దేవికొండ గ్రామానికి చెందిన కిషన్ అనే రైతుకు చెందిన గేదె సోమవారం (సెప్టెంబర్ 28,2020)ఉదయం ఒక దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ తెల్లగా తళతళ మెరిసిపోతోంది. దానిని చూసి ఆ రైతు కూడా ఆశ్చర్యపోయాడు. గేదె ఈనేటప్పుడు సగం బైటకొచ్చిన ఆ దూడను చూసి ఏంటీ గేదెకు ఆవుదూడ పుడుతోందా? అని షాక్ అయ్యారు. గ్రామస్తులు కూడా ఆ దూడను చూసి ఆశ్చర్యపోతున్నారు.
గేదెకు తెల్లదూడ పుట్టిందేంటి అని వింతగా చెప్పుకుంటున్నారు. ప్రసవించిన గేదెను పరిశీలించిన పశువుల డాక్టర్లు మాట్లాడుతూ..జన్యులోపం వల్ల అలా తెల్లగా పుట్టిందని చెప్పారు. కొన్నివేల బర్రెల్లో ఏదొక బర్రెకు ఇలా తెల్లదూడలు పుడతాయని పేర్కొంటున్నారు. బర్రెకు రెండు కొమ్ముల మధ్య తల మీద మాత్రమే తెల్లని చుక్క ఉంది.
దూడ మాత్రం పూర్తిగా తెలుపు రంగులో ఉండటంతో చుట్టు పక్కల గ్రామాలవాళ్లు కూడా దానిని చూడటానికి వస్తున్నారు. తల్లి వద్ద దూడ పాలు తాగుతున్న సమయంలో తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.